Chennai Rain: చెన్నైలో భారీ వర్షాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం..

Chennai Rain (tv5news.in)
Chennai Rain: తమిళనాడు రాజధాని చెన్నైను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై లోని కొరాటూర్, పెరంబూర్, అన్నా సలాయ్, టీ నగర్, గ్వియిండీ, అడయార్, పెరుంగుడి ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి మోకాలి లోతు వరద నీరు చేరింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించింది.
భారీ వర్షాల కారణంగా చెంబరబాక్కం జలాశయంలో ఇప్పటికే 21.15 అడుగులకు నీటమట్టం చేరడంతో క్రస్ట్ గేట్లు ఎత్తివేయక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో చెంబరబాక్కం పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
చెన్నై మరోసారి భయం గుప్పిట్లో చిక్కుకుంటోంది. భారీ వర్షాలు ఆందోళన కల్గిస్తున్నాయి. రానున్న 5 రోజులు నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయనే హెచ్చరికతో చెన్నవాసులకు 2015 నాటి వరద బీభత్సం కళ్లముందు కదలాడుతూ భయం గొలుపుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మహా వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది..ఈనెల 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు.. దీనికితోడు ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు.
మరోవైపు ముప్పును ఎదుర్కొనేందుకు తమిళనాడు ప్రభుత్వం అన్నివిధాలా సిద్ధమౌతోంది. విపత్కర పరిస్థితులలో రక్షణ చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంధ సేవకులను సిద్ధంగా ఉంచింది. సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం కంట్రోలు రూం ఏర్పాటు చేసింది. అల్పపీడన ద్రోణి వల్ల ఏర్పడే ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పటికే అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com