Chhattisgarh: బిడ్డ కోసం అడవి పందితో హోరాహోరీ.. చివరికి...

Chhattisgarh: బిడ్డ కోసం అడవి పందితో హోరాహోరీ.. చివరికి...
ఛత్తీస్ ఘడ్ లో కంటతడి పెట్టిస్తున్న ఓ తల్లి పోరాటం; తన చిన్నారిని కాపాడుకోవడానికి వరాహంతో పోరాడిన తల్లి..

ఆపద వచ్చినప్పుడు కాపాడేందుకు దేవుడు ప్రతి చోటా ఉండలేడు. అందుకే అమ్మను ఇచ్చాడు అంటారు పెద్దలు. నిజమే బిడ్డలపై ఈగ వాలనివ్వకుండా కంటికి రెప్పలా సాకే తల్లి... వంద మంది సైన్యానికి సరితూగుతుంది అనడంలో సందేహమేలేదు. ఛత్తీస్ ఘడ్ లో చోటుచేసుకున్న ఈ ఉదంతం గురించి తెలుసుకుంటే అది నిజమని ఒప్పుకుంటారు. కన్న బిడ్డను అడవి పంది దాడి నుంచి కాపాడుకునేందుకు ఒంటి చేత్తో పోరాడి ప్రాణాలు విడిచింది ఓ తల్లి.

రాయ్ పూర్ లోని తెలియామార్ గ్రామానికి చెందిన దువ్సియా బాయ్ (45), ఆమె కుమార్తే రింకి(11ఏళ్లు) పంట పొలాల్లో పనిచేస్తుండగా, అటువైపుగా ఓ అడవి పందుల బృందం వెళుతోంది. ఈ విషయాన్ని గమనించని దువాసియా, రింకీ తమ పనిలో నిమగ్నమైపోయారు. తొలుత దువ్సియా అడవి పందుల బృందాన్ని గేదెల గుంపుగా భావించింది. తీరా ఆ గుంపులో నుంచి ఓ అడవి పంది నేరుగా రింకీ వైపు దూసుకురావడం మొదలుపెట్టింది. ఇది గమనించిన దువ్సియా రెప్పపాటు వేగంతో నేరుగా కూతురు వద్దకు చేరుకుని ఆమె రెక్కలు పట్టుకుని పక్కకు విసిరేసింది. ఇంతలోనే అడవి పంది దువాసియా పై పడి దాడి చేయడం మొదలుపెట్టింది. చిన్నారిని అక్కడ నుంచి పారిపోమ్మని చెబుతూనే దువ్సియా తన చేతిలో ఉన్న కత్తితో ఎలుగుపై ప్రతి దాడికి పూనుకుంది. వారిద్దరి మధ్య భీకర పోరు సాగింది. పంది ఆమె చీరలో చిక్కుకుపోవడంతో తప్పించుకునేందుకు దువ్సియాపై దాడి చేస్తూనే ఉంది. దువ్సియా సైతం తన కత్తితో పంది మెడపై పలుమార్లు పొడించింది. చివరకు ఆ తల్లి తెగువకు ఆ వరాహం తలొగ్గక తప్పలేదు.

వరాహం నేలకు ఒరగడంతోనే దువ్సియా సైతం కుప్పకూలిపోయింది. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయిందని, దువ్సియాను రక్షించే వ్యవధి కూడా దొరకలేదని ఆమెతో పాటూ పనిచేస్తున్న వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు రింకీ తన తండ్రిని తీసుకుని తల్లి దగ్గరకు చేరుకునేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది. కూతురు సురక్షితంగా ఉందని భరోసా లభించడంతో దువాసియా తృప్తిగా కన్నుమూసింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వారు దువాసియ ధైర్య సాహసాలను కొనియాడుతూ, తెలియామార్ కు తరలివెళుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నారు.

ఈ ఉదంతం పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే అతి పెద్దదైన అడవి పందిని చూసి వారే ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద వరాహాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూడటం ఇదే మొదటిసారి అని విస్తుపోతున్నారు. దువ్సియా కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.25వేలు అందజేశామని, అధికారిక పత్రాలు విడుదలవ్వగానే రూ.5లక్షల 75వేలు అందజేస్తామని తెలిపారు. ఏమైనా దువాసియా ప్రాణాలు ఒడ్డి కాపాడుకున్న చిన్నారిని ఓదార్చడం మాత్రం ఎవరి తరం కావడంలేదు. ఆ తల్లి ధైర్యమే ఆమెకు శ్రీరామ రక్ష కావాలని ఆశిద్దాం.



Tags

Read MoreRead Less
Next Story