అరుణాచల్ ప్రదేశ్‌లోని గ్రామం తమదేనంటూ చైనా వివాదాస్పద వ్యాఖ్యలు

అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోని అంతర్భాగమేనంటూ.. చైనా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత్ భూభాగంలో అక్రమంగా నిర్మిస్తున్నట్టు చెబుతున్న గ్రామంపై.. చైనా కీలక ప్రకటన చేసింది. అదంతా తమ భూభాగమేనంటూ చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితం అమెరికాకు చెందిన ప్లానెట్ ల్యాబ్స్ అనే సంస్థ అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా గ్రామాన్ని నిర్మిస్తోందని శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. దీనిపై భారత్‌లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. అయితే.. ఇప్పుడా గ్రామాన్ని చైనా తనదేనంటూ స్పష్టం చేసింది. అదంతా తమ దేశ భూభాగంలోనే ఉందని వితండవాదానికి దిగింది. అది దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమని తెలిపింది.
ఓ అడుగు ముందుకేసి భారత్- చైనా సరిహద్దుల్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఆ గ్రామాలు.. తమ జంగ్నాన్ ప్రావిన్స్‌లోనివని పేర్కొంది. అదంతా చైనాకు చెందిన టిబెట్‌లోని అంతర్భాగమని స్పష్టం చేసింది. అసలు చైనా భూభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ ప్రత్యేక రాష్ట్రంగా తాము ఎన్నడూ గుర్తించలేదని వాదిస్తోంది. చైనా భూభాగంలో జరుగుతున్న సాధారణ నిర్మాణాలేని ఆదేశ విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అయితే ఈ చిత్రాలు విడుదలైన సందర్భంగా.. సరిహద్దుల్లో చైనా నిర్మాణాలు జరుపుతున్నప్పటికీ.. అక్కడి గ్రామాల్లో రోడ్లు, వంతెనల వంటి మౌలిక సదుపాయల కల్పనకు కట్టుబడి ఉన్నట్టు భారత్ తెలిపింది.
తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌లో 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చి సుభాన్‌సిరి జిల్లాలో తారి చూ నది ఒడ్డున చైనా ఓ గ్రామాన్ని నిర్మించింది. అమెరికన్ సంస్థ శాటిలైట్ ద్వారా తీసిన ఫొటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. చైనా నిర్మించిన ఆ ప్రాంతంలో 101 ఇళ్లు ఉన్నట్టు తెలిసింది. 2019 ఆగస్టు 26న తీసిన ఫొటోల్లో ఆ ప్రాంతంలో ఎలాంటి ఇండ్లు, నిర్మాణాలు కనిపించలేదు. తాజాగా గత నవంబర్ 1న తీసిన శాటిలైట్ ఫొటోల్లో ఇళ్లు నిర్మించినట్టు తెలిసింది.
శాటిలైట్ ఇమేజ్‌స్‌లో కనిపిస్తున్న ఆ గ్రామం తమదేశంలోని భూభాగమేనంటూ.. చైనా మరోసారి వితండ వాదనకు దిగడం.. మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. గతంలోనే చైనా అనేకసార్లు.. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ భూభాగమేనని వాదించింది. దీన్ని ఆక్రమించుకోవడానికి అనేక రకాల ఎత్తుగడలు వేసింది. చాలా సందర్భాల్లో.. చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లో చొచ్చుకుని రావడం.. ఘర్షణలు జరిగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com