అభిమాని కూతురి పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి 'లక్ష' సాయం

మిర్చి బండితో చిరు వ్యాపారం సాగించే శేఖర్‌కి మెగాస్టార్ చిరంజీవి అంటే చెప్పలేనంత అభిమానం. చిరంజీవి సినిమా వచ్చిందంటే మొదటి రోజే మొదటి ఆట చూసేయాలనుకుంటాడు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి శేఖర్ గత 30 సంవత్సరాల నుంచి మెగాస్టార్‌కి వీరాభిమాని. రాష్ట్రస్థాయిలో చిరంజీవి సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడంలో శేఖర్ ముందు వరుసలో ఉంటాడు. శేఖర్‌కి ఇద్దరు కూతుళ్లు వర్ష, నిఖిత. అతడి పేదరికాన్ని, కూతురు వర్ష పెళ్లి చేయడానికి అతడు పడుతున్న ఇబ్బందిని తెలుసుకుని లక్షరూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. మెగా స్టార్ చిరంజీవి లక్ష రూపాయల సహాయం చేయడం హర్షనీయమని అన్నారు. చిరంజీవిని దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు.
అభిమానులు ఎవరు కష్టాల్లో ఉన్నా తనకు సమాచారం అందించాలని చిరంజీవి స్వయంగా తమతో చెప్పారని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం రావణస్వామి నాయుడు తెలిపారు. నగదు సాయం అందుకున్న శేఖర్.. రక్త సంబంధీకులు చేయని సాయాన్ని తమ హీరో చేశారని,, ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనిదని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com