శభాష్.. 14 ఏళ్ల బాలిక పెళ్లి ఆపేసింది

శభాష్.. 14 ఏళ్ల బాలిక పెళ్లి ఆపేసింది
ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధిని కొన్ని రోజుల్లో జరగాల్సిన తన పెళ్లిని ఆపడానికి సోమవారం చైల్డ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించింది.

పెళ్లి చేస్తే ఓ పనైపోతుందనుకుంటున్నారే కానీ.. పెళ్లితోనే కష్టాలు మొదలవుతాయని ఆలోచించట్లేదు ఇప్పటికీ చాలా మంది. తనకు చేస్తున్న పెళ్లిని వ్యతిరేకిస్తూ 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక చైల్డ్ హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలికకు పెళ్లి జరగకుండా అడ్డుకున్నారు.

రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘర్ జిల్లాలో 14 ఏళ్ల బాలిక ఇంటికి పోలీసుల బృందం వచ్చింది. బాలిక కుటుంబసభ్యులతో మాట్లాడి, అప్పుడే పిల్లకు పెళ్లి చేయొద్దని తెలిపింది.

ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధిని కొన్ని రోజుల్లో జరగాల్సిన తన పెళ్లిని ఆపడానికి సోమవారం చైల్డ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించింది. తాను చదువుకోవాలనుకుంటున్నానని, పెళ్లి ఇష్టం లేదని తెలిపింది. డిసెంబర్ 11న జరగాల్సిన తన పెళ్లిని అడ్డుకోవాల్సిందిగా పోలీసులను కోరింది.

స్థానిక పోలీసు బృందం ఆమె ఇంటికి చేరుకున్నప్పుడు బాలిక పాఠశాలలో ఉంది. బాలిక తల్లిదండ్రులు, తాతలను సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) కార్యాలయం ముందు హాజరుపరిచారు. అక్కడ వారికి బాల్య వివాహాల నిషేధ చట్టం గురించి వివరించారు.

బాలిక తల్లిదండ్రులకు తమ కుమార్తెకు పెళ్లి చేసేందుకు ఆసక్తిగా లేరు. కానీ అమ్మాయి తాత, అత్త బలవంతంపై ఈ పెళ్లి చేస్తున్నట్లు తెలిపారు. గత నెలలో ఉదయ్‌పూర్‌లో కూడా ఇదే మాదిరిగా 26 ఏళ్ల యువకుడితో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని వివాహాన్ని కమిషన్ ఆపగలిగింది.

Tags

Read MoreRead Less
Next Story