Pushkar Singh Dhami : ఉమ్మడి పౌరస్మృతిపై ఉత్తరాఖండ్ సీఎం కీలక నిర్ణయం..!

Pushkar Singh Dhami : ఉమ్మడి పౌరస్మృతిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు నిపుణులతో కూడిన హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్ తొలి భేటీలో ఆమోదం తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ.. ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ముసాయిదాను రూపొందిస్తుంది. దీన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ధామీ.
దీన్ని ఇతర రాష్ట్రాల కూడా అనుసరిస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాఖండ్.. భిన్న సంస్కృతులు, భిన్నమతాల సమ్మేళనమని, దీంతో పాటు రెండు దేశాలతో రాష్ట్రానికి సరిహద్దులు ఉండడం వల్ల ఉమ్మడి పౌరస్మృతి అవసరమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో ప్రోవిజన్ ఉందని, దీన్ని అమలు చేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు సైతం గతంలో అసహనం వ్యక్తంచేసిందన్నారు ధామీ. ఓ సారి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే.. వివాహం, వారసత్వం, ఆస్తి హక్కులకు సంబంధించి ఒకే చట్టం అమల్లో ఉంటుంది.
అంటే హిందూ వివాహ చట్టం, 1955, హిందూ వారసత్వ చట్టం -1956 లేదా భారత వారసత్వ చట్టం- 1925, షరియత్ చట్టం - 1937 వంటివి ఇక చెల్లుబాటులో ఉండవు. అటు.. ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ ద్వారా కేవలం కేంద్రానికి మాత్రమే ఉంటుందంటున్నారు న్యాయనిపుణులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com