Karnataka : కర్ణాటకలో తీవ్ర దుమారం రేపిన మంత్రి వ్యాఖ్యలు.. ఎర్రకోటపై

Karnataka : కర్ణాటకలో ఓ వైపు హిజాబ్ వివాదం కొనసాగుతుండగానే ఆ రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై ఏదో ఒక రోజు కాషాయ జెండా ఎగురుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఈ వ్యాఖ్యలు కర్ణాటక అసెంబ్లీ సమావేశాలను కుదిపేశాయి.
మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కేఎస్‌ను మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న రాత్రి అనూహ్యంగా అసెంబ్లీలో నిరసనకు దిగారు. రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రపోయారు.
మంత్రి కేఎస్ ఈశ్వరప్పను కేబినెట్ నుంచి తప్పించే వరకు అసెంబ్లీలో నిరసన కొనసాగుతుందని తేల్చిచెప్పారు సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దీంతో స్వయంగా సీఎం బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప రంగంలోకి దిగారు. నిరసన విరమించాలని కాంగ్రెస్ నేతలకు విజ్ణప్తి చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ససేమిరా అన్నారు. మంత్రిపై దేశద్రోహం కేసు నమోదు చేసి, ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
అప్పటివరకు తమ నిరసన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఇవాళ మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడి నిరసనను విరమింపజేసేందుకు ప్రయత్నిస్తామన్నారు యడియూరప్ప. అటు మంత్రి కేఈ ఈశ్వరప్ప మాత్రం.. నిరసన చేస్తే చేసుకోనివ్వండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com