పుదుచ్చేరి తెరపై మొదలుకానున్న అసలుసిసలు డ్రామా

పుదుచ్చేరి తెరపై మొదలుకానున్న అసలుసిసలు డ్రామా
ఇప్పుడిక స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్ మొత్తం లెఫ్టినెంట్ గవర్నర్‌ తమిళిసై చేతిలోనే ఉంది.

పుదుచ్చేరిలో ఇప్పుడే అసలైన డ్రామా మొదలుకాబోతోంది. బీజేపీ పన్నిన వ్యూహం నుంచి నారాయణస్వామి సర్కార్‌ గట్టెక్కలేకపోయింది. అంతా అనుకున్నట్టే ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడిక స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్ మొత్తం లెఫ్టినెంట్ గవర్నర్‌ తమిళిసై చేతిలోనే ఉంది. ఇవాళ రేపట్లో ఎల్జీ తమిళిసై తీసుకునే నిర్ణయం ఆధారంగానే పుదుచ్చేరి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ ముందు మూడు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

పుదుచ్చేరిలో వచ్చే ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీఎం నారాయణ స్వామి రాజీనామా లేఖ అందించారు కాబట్టి ఎన్నికలు జరిగే వరకు ఆయననే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని లెఫ్టినెంట్ గవర్నర్ సూచించొచ్చు. కానీ ఆ మాత్రం దానికి బీజేపీ ఇన్ని వ్యూహాలు రచించాల్సిన అవసరం లేదు. సో, ఆ అవకాశం లేదంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్‌. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం ప్రతిపక్షానికి ఉంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రంగస్వామిని కోరే అవకాశం ఉంది.

అయితే ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు కాబట్టి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పెద్దగా లాభం ఉండదనే వాదన వినిపిస్తోంది. ఇక మూడో ఆప్షన్.. అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించడం. ఇందుకోసం లెఫ్టినెంట్ గవర్నర్‌ తమిళిసై కేంద్రానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన అంటే ఒక విధంగా పరిపాలన మొత్తం బీజేపీ చేతిలో ఉన్నట్టే లెక్క. సో, ఈ మూడో ఆప్షన్‌కే ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్రపతి పాలన విధించడంపై తమిళసై నేరుగా నిర్ణయం తీసుకుంటారా? లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ప్రతిపక్షాన్ని అడిగిన తరువాత నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలి.

తాజా పరిణామాల నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న తమిళిసై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఏం చేయాలన్న దానిపై ఎల్జీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే, రాజ్యంగ నిపుణుల నుంచి సలహాలు తీసుకుని ముందుకు వెళ్లొచ్చని చెబుతున్నారు. అయితే ఈ రాజకీయ డ్రామా అంతా కేంద్ర పెద్దలకు తెలిసే జరుగుతోందని, వారు చెప్పినట్టే లెఫ్టినెంగ్ గవర్నర్ చేస్తారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story