Congress Meet: సొంత డబ్బా కోసం వేలకోట్లు తగలేస్తున్నారు- కేంద్రంపై ప్రియాంక ఫైర్

Priyanka Gandhi (tv5news.in)
Congress Meet: మోదీకి ప్రభుత్వాలు కూల్చడంలో ఉన్న శ్రద్ధ.. ప్రజలపై లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. పెరిగిన ధరలకు కేంద్రం చేతగాని తనమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ఓమత సంస్థ.. కార్పొరేట్లు కలిసి నడిపిస్తున్నాయని మండిపడ్డారు. అబద్ధాల మీదే కేంద్ర ప్రభుత్వం బతుకుతోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. బీజేపీకి ఓటుతోనే దిమ్మతిరిగే సమాధానం ఇవ్వాలన్నారు.
కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ప్రధాని మోదీకి ప్రభుత్వాలను కూల్చడంలో ఉన్న శ్రద్ధ.. ప్రజలపై లేదన్నారు. దేశాన్ని తనకు కావాల్సిన ఐదుగురు కార్పొరేట్ల చేతిలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెరిగిన ధరలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్ లోని జైపూర్ లో నిరసన తెలిపింది కాంగ్రెస్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు రాహుల్.
కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా పాల్గొన్నారు. పెరిగిన ధరలకు కేంద్రమే కారణమని మండిపడ్డారు రాహుల్. దేశమంతా ఓ సంస్థ చేతుల్లో బంధి అపోయిందంటూ RSSను టార్గెట్ చేశారు. హిందుత్వపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్. ప్రస్తుతం హిందువుకు, హిందుత్వవాదికి మధ్య పోటీ నడుస్తోందన్నారు.
తాను ఎప్పటికీ హిందువునే తప్ప హిందుత్వవాదిని కాదన్నారు. మహాత్మగాంధీ హిందువైతే, గాడ్సే హిందుత్వవాదని.. రెండు పదాల్లో చాలా తేడా ఉందన్నారు రాహుల్. నిజమైన హిందువు అందరినీ సమానంగా చూస్తాడని, ఇతరమతాలను గౌరవిస్తాడని, ఎవరికీ భయపడడని చెప్పారు రాహుల్ గాంధీ. అబద్ధాల మీదే కేంద్ర ప్రభుత్వం బతుకుతోందన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.
ప్రకటనల పేరుతో సొంత డబ్బా కొట్టుకోవడానికి వేలకోట్లు తగలేస్తున్న ప్రభుత్వానికి.. రైతులకు రూపాయి ఇచ్చేందుకు కూడా చేతులు రావట్లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగసభకు జనం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. చాలాకాలం తర్వాత బహిరంగసభలో పాల్గొన్న సోనియాగాంధీ.. వేదిక పైనుంచి తరచూ జనానికి అభివాదం చేస్తూ కనిపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com