మేము ఎలా మనుగడ సాగించాలి : సోనియాగాంధి

కాంగ్రెస్ వాది, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొద్దిరోజుల క్రితం కరోనా సోకగా.. ఆ తర్వాత మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు ఆపరేషన్ చేశారు. ఢిల్లీలోని ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో పరిస్థితి మరింతగా విషమించింది. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు చేసిన శ్రమ ఫలించలేదు. ప్రణబ్ ఇక లేరన్న విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ వయసు 84 ఏళ్లు.
ఇవాళ సాయంత్రం ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఢిల్లీలోని లోథి ఎస్టేట్‌లో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అటు ప్రణబ్ మృతికి సంతాప సూచికగా ఏడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ సహా అన్ని కార్యాలయాలపై జాతీయ జెండాను అవనతం చేశారు.
ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రణబ్ ఇక లేరన్న వార్త ఎంతో బాధ కలిగిస్తోందని, ఆయన మరణంతో ఓ శకం ముగిసినట్టయిందని రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఎంతో పవిత్రమైన ఆత్మతో భరత మాతకు సేవలు అందించారని, ప్రజా జీవితంలో సమున్నతంగా నిలిచారని కొనియాడారు. ఎంతో విలువైన తన బిడ్డల్లో ఒకరిని కోల్పోయిన దేశం.. రోదిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేసుకుంటున్నానని ట్వీట్ చేశారు. దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకు దగ్గర చేస్తూ సత్సంప్రదాయాన్ని కొనసాగించారన్నారు.
భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అస్తమయంతో భారత్ క్షోభిస్తోందని పేర్కొన్నారు ప్రధాని మోదీ. దేశ అభివృద్థి పథంలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. సమున్నత ఎత్తులకు ఎదిగిన రాజనీతి కోవిదుడు, పండితుడు అంటూ కీర్తించారు. రాజకీయ చిత్రపటంలో అన్ని వర్గాల వారిని మెప్పించి, సమాజంలో అందరి మన్ననలకు పాత్రుడయ్యారంటూ మోదీ ట్వీట్ చేశారు.
అటు.. కాంగ్రెస్ వర్గాలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రణబ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన సందేశం వెలువరించారు. ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠకు లేఖ రాశారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రణబ్ జాతి ప్రస్థానంలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ విడదీయరాని భాగం అయ్యారని... ఆయన మేధాశక్తి తోడు లేకుండా ఇప్పుడు మేం ఎలా మనుగడ సాగించగలమో ఊహించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఆయన అనుభవం, నిష్కల్మషమైన సలహాలు, లోతైన అవగాహన శక్తి వంటి అనేక అంశాలతో ప్రణబ్ ఇప్పటివరకు మాకు తోడుగా ఉన్నారని లేఖలో వెల్లడించారు సోనియా గాంధీ. ఆయన జ్ఞాపకాలు కాంగ్రెస్ పార్టీ హృదయంలో చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. ప్రణబ్‌జీ మరణంతో దేశం మొత్తం దుఖఃసాగరంలో మునిగిపోయిందన్నారు ఎంపీ రాహుల్ గాంధీ.
ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల పార్టీలకు అతీతంగా నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యునిగా, కేంద్రమంత్రిగా, రాష్ట్రపతిగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అత్యంత క్లిష్టమైన సమయాల్లో.. ఎంతో నేర్పుగా వ్యవహరించడం ఆయన్ను చూసే నేర్చుకోవాలని నాయకులు అన్నారు. ప్రణబ్ లాంటి మేథస్సు, రాజనీతిజ్ఞత కలిగిన నాయకులు చాలా అరుదని నేతలు కొనియాడారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి చెందడం పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం తెలిపారు. అటు.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. గత కొన్ని వారాలుగా వైద్యులు శక్తివంచన లేకుండా శ్రమించినా ప్రణబ్ తుదిశ్వాస విడవడం దురదృష్టకరమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అంశంతో ప్రణబ్ ముఖర్జీకి ప్రత్యేక అనుబంధం ఉందని, నాడు ప్రత్యేక తెలంగాణ అంశంపై యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ప్రణబ్ ముఖర్జీనే నాయకత్వం వహించారని కేసీఆర్ గుర్తుచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com