కాంగ్రెస్‌లో కనీవినీ ఎరుగని పరిణామాలు.. ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు

జాతీయ కాంగ్రెస్ పార్టీలో కనీవినీ ఎరుగని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అధిష్టానం తీరును సవాలు చేస్తూ ఘాటు లేఖ రాసిన గులాం నబీ ఆజాద్ సహా పలువురు కీలక సీనియర్ నేతలను పదవుల నుంచి తప్పించారు. అయితే.. పార్టీ ప్రక్షాళనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గులాంనబీ ఆజాద్‌ను తొలగించింది. అటు.. అంబికా సోని, మోతీలాల్ వోరా, మల్లికార్జున ఖర్గేను పక్కకు పెట్టింది. ఇప్పటివరకు యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఆజాద్ వ్యవహరించారు. అయితే.. యూపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ప్రియాంక గాంధీని నియమించింది.
ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగిన గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్ వోరా, లుజిన్హో ఫలేరియో, అంబికా సోనిలను పదవుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. కాగా.. ఆజాద్, అంబికా సోనిలు వర్కింగ్ కమిటీలో సభ్యులుగా మాత్రం కొనసాగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. CWCలో సోనియా గాంధీ సహా 22 మంది సభ్యులు, 26 మంది శాశ్వత సభ్యులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులతో కూడిన జాబితా విడుదల చేశారు.
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నికతో పాటు సంస్థాగతంగా ప్రక్షాళన అవసరమంటూ 23 మంది సీనియర్లు సోనియా గాంధీకి రాసిన లేఖపై ఇటీవల పెద్ద దుమారం చెలరేగింది. ఆరు నెలల్లోగా కొత్త చీఫ్, ప్రక్షాళన ప్రక్రియ చేపడతామమని ఏఐసీసీ అధికార ప్రతినిధులు గతంలోనే ప్రకటించారు. ఆ ప్రక్రియలో భాగంగానే అధినేత్రి సోనియా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కుంతియా స్థానంలో.. తమిళనాడు ఎంపీ మాణికం ఠాగూర్‌ను నియమించింది అధిష్టానం. ఇక ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కొనసాగనున్నారు. మరో వైపు.. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చింతా మోహన్‌కు CWCలో ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం లభించింది. ఏపీ నుంచి ఒకే ఒక్కరికి స్థానం కల్పించింది.
ఇదిలా ఉండగా.. పార్టీలో సీనియర్లు, కీలక నేతలుగా వ్యవహరించిన వారిని తొలగించడం చర్చనీయాంశమైంది. అధిష్ఠానం నిర్ణయంపై ఆజాద్, ఖర్గే ఇంతవరకూ స్పందించలేదు. కీలక నేతలుగా వ్యవహరించిన వారందర్నీ ఇలా పక్కకునెట్టడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com