మాజీ సీఎం మోతీలాల్ వోరా కన్నుమూత!

కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మోతీలాల్ వోరా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా సేవలను అందించారు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీకి కోశాధికారిగా కూడా పనిచేశారు. గాంధీ కుటుంబానికి విధేయుడని వోరాకి మంచి పేరుంది.
ఆయన మరణం పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం తెలుపుతున్నారు. పార్టీ దిగ్గజనేతను కోల్పోయామని కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా వోరా మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా వోరా ఆదివారమే తన 93వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కాకుండా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా కూడా వోరా తన సేవలను అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com