దేశంపై మళ్లీ కరోనా వైరస్ పంజా.. 24 గంటల్లో 188 కరోనా మరణాలు

దేశంలోకరోనా వైరస్ మరోసారి తీవ్ర రూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 188 కరోనా మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య సోమవారం నాడు 24వేలు ఉండగా.. మంగళవారం నాడు ఆ సంఖ్య 28వేలకు పైగా నమోదైంది. మొత్తం 9. 69లక్షల పరీక్షలు చేయగా.. 28,903 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటీ 14 లక్షల 38 వేల 734 కి చేరింది. కొత్తగా 17 వేల 741 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు.
దేశంలో రికవరీ రేటు 96.65 శాతంగా ఉంది. ఇక మరణాల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 188 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య లక్షా 59 వేల 44కి చేరింది. మరణాల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2 లక్షల 34 వేల 406 కి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 21లక్షల మందికి టీకా వేశారు.
మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవే మొదలైనట్లే కన్పిస్తోంది. అక్కడ నమోదవుతున్న రోజువారీ కేసులు యావత్ దేశాన్ని కలవరపెడుతున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కొత్త కేసుల సంఖ్య 17వేలు దాటాయి. మంగళవారం 17వేల 864మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 61శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చివరిసారిగా గతేడాది సెప్టెంబరులో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 23 లక్షల 47వేల 328కి చేరింది. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 87 మంది వైరస్‌కు బలయ్యారు.
ఇక దేశవ్యాప్తంగా గత పది రోజులుగా కొవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న జిల్లాలను కేంద్రం గుర్తించింది. మొత్తం 19 జిల్లాల్లో రోజువారీ కేసులు పెరుగుతుండగా.. అందులో 15 కేవలం మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఈ జిల్లాల్లో గత పదిరోజులుగా కొత్త కేసుల సంఖ్య వెయ్యికి పైనే ఉంటోంది. మహారాష్ట్రలో మళ్లీ వైరస్ విజృంభణకు ప్రజల నిర్లక్ష్యమే కారణమని కేంద్ర బృందం తేల్చింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని ప్రజలు కూడా కొవిడ్ నిబంధలను పట్టించుకోవడం లేదని, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం వంటివాటిని గాలికొదిలేస్తున్నారని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com