గుండెపై కరోనా వైరస్ ప్రభావం

గుండెపై కరోనా వైరస్ ప్రభావం
ఆయాసంగా అనిపిస్తే అలక్ష్యం చేయకూడదు..

గుప్పెండత గుండె కొట్టుకుంటేనే మనిషి మనుగడ సాగించగలడు.. ఏమాత్రం అలక్ష్యం చేసినా గుండె ఆగిపోతుంది. కోవిడ్ సీజన్‌లో హృద్రోగ వ్యాధి గ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని హృద్రోగ వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తి, కేసులు పెరుగుదల, స్నేహితులు, బంధువుల మరణం తీవ్ర ఒత్తిడి కలుగజేస్తాయి. ఇవన్నీ గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తాయి.

చిన్న సమస్యే కదా అని అలక్ష్యం చేయక డాక్టర్‌ని సంప్రదించడం అవసరం. గుండెకు సంబంధించి తేలిగ్గా తీసుకోకూడని విషయాలు..

రోజూ చేస్తున్న పనే అయినా ఆ రోజెందుకో ఆయాసంగా అనిపిస్తే అలక్ష్యం చేయకూడదు. పక్కనే ఉన్న దుకాణానికి నడిచినా ఆయాసం వస్తుంటే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని కలవాలి.

కొత్తగా అలసట మొదలైనా అప్రమత్తం కాక తప్పదు. అలసట కారణంగా ఆ పని చేయలేకపోతున్నా, వాయిదా వేస్తున్నా ఆ మార్పును తేలిగ్గా తీసుకోకూడదు.

ఛాతిలో అసౌకర్యంగా అనిపించినా అశ్రద్ద చేయకూడదు. గ్యాస్ సమస్యగా భావించి త్రేన్సులు వస్తే రిలీఫ్ అవుతుంటారు. అయినా ఒకసారి గుండె వైద్యులను సంప్రదించి నిర్ధారించుకోవాలి. 40 ఏళ్లు దాటిన వారు ఛాతిలో అసౌకర్యంగానే తీవ్రంగానే పరిగణించాలి.

ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వారికి కూడా గుండెపోటు రావచ్చు. వైద్యులు కూడా కారణాలు కచ్చితంగా కనిపెట్టలేకపోవచ్చు. శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, శరీరంలో పేరుకున్న అధిక కొవ్వు, మానసిక ఒత్తిడి గుండెపై ప్రభావం చూపిస్తాయి. శరీరంలో పెరిగే ఒత్తిడి.. ఎడ్రినలిన్, డోపమైన్ హార్మోన్ల మీద ప్రభాశం చూపిస్తాయి. ఫలితంగా గుండెలోని రక్తనాళాలు కుచించుకుపోయి గుండె పోటుకు దారి తీస్తాయి. బీపీ, షుగర్ లేవు కదా అని గుండె పోటు రాదనుకోవడానికి లేదు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ గుండె జబ్బులను ముందుగానే గుర్తించే పరీక్షలు చేయించుకోవాలి. అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం.

గుండె సమస్యలున్న వారికి వైరస్ సోకితే సమస్య మరింత తీవ్రం అవుతుంది. కొవిడ్ వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే స్వభావం పెరుగుతుంది. దాంతో రక్తసరఫరా సక్రమంగా జరగక ప్రధాన అంతర్గత అవయవాలు దెబ్బతినే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి కోవిడ్ సోకిన వ్యక్తులు తప్పనిసరిగా రక్తం పలుచన చేసే మందులు వాడాల్సి వుంటుంది. కరోనా వచ్చి కోలుకున్న తరువాత జనరల్ హార్ట్ చెకప్ చేయించుకుని వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలి. గుండెకు స్టంట్లు వేయించుకున్న వ్యక్తులు కరోనా సోకిన వ్యక్తులను కలవక పోవడమే మంచిది. వీరికి వైరస్ త్వరగా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

కోవిడ్ కారణంగా గుండెజబ్బులు తలెత్తినా, గుండెజబ్బులు కలిగిన వాళ్లకు కోవిడ్ సోకినా సర్జరీకి బదులు స్టెంట్లు వేసే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. స్టెంట్లతో ఆరోగ్యాన్ని కుదుటపరిచి, చికిత్ప కొనసాగిస్తారు. కరోనా నెగిటివ్ అని తేలిన తరువాత సర్జరీకి సిద్ధం చేస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే కోవిడ్ వచ్చినా సర్జరీ చేయక తప్పదని కార్డియాలజిస్టులు వివరిస్తున్నారు.

Tags

Next Story