కరోనా వైరస్‌కు విరుగుడుగా తయారవుతున్న మరో రకం వ్యాక్సిన్

కరోనా వైరస్‌కు విరుగుడుగా తయారవుతున్న మరో రకం వ్యాక్సిన్
చింపాంజీ అడినోవైరస్ ఆధారంగా నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను రెడీ

కరోనా వైరస్‌కు విరుగుడుగా మరో రకం వ్యాక్సిన్ తయారవుతోంది. ముక్కు ద్వారా ఇచ్చే టీకాను వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అభివృద్ధి చేస్తోంది. చింపాంజీ అడినోవైరస్ ఆధారంగా నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను రెడీ చేస్తోంది. దీని తయారీకి భారత్ బయోటెక్ ముందుకొచ్చింది. ఈ మేరకు వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో భారత్ బయోటెక్‌ ఒప్పందం కూడా చేసుకుంది. అమెరికా, జపాన్, ఐరోపా దేశాలు తప్ప మిగతా ప్రపంచ దేశాల్లో ఈ టీకా పంపిణీకి సంబంధించిన అన్ని హక్కులను భారత్ బయోటెక్ సొంతం చేసుకుంది.

నాసల్ స్ప్రే తొలి దశ ప్రయోగాలు సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో చేపడతారు. ఇక అనుమతుల ప్రక్రియ పూర్తయ్యాక ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్‌ని మన దేశంలోనే నిర్వహించనుంది భారత్ బయోటెక్. క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు భారత్ బయోటెక్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను కోటి డోసులు రెడీ చేయాలని ఆ సంస్థ ప్లాన్ చేస్తోంది. సంప్రదాయ వ్యాక్సిన్‌లో సిరంజీలు, సూదుల వాడకం తప్పనిసరి. కానీ నాసల్ స్ప్రే టీకాకు ఇవేవీ అవసరం ఉండవని వైద్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు ఈ టీకాను వేయడం చాలా ఈజీ అని చెప్తున్నారు. దీన్ని సింగిల్ డోస్‌లో ఇచ్చేలా రూపొందిస్తున్నారు. మరోవైపు నాసల్ వ్యాక్సిన్ పంపిణీకి అయ్యే ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉందని భారత్ బయోటెక్ సంస్థ అంటోంది.

ప్రస్తుతం చాలా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలోనే ఉన్నాయి. అయితే వీటన్నింటికంటే కూడా నాసల్ స్ప్రే వ్యాక్సిన్ పనితీరు మెరుగ్గా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ టీకాను ముక్కులో వేయడం వల్ల ముక్కుతోపాటు గొంతులో ఉండే వైరస్‌ నశించే వీలుందని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఈ వ్యాక్సిన్ ముక్కుతోపాటు, గొంతులో ఉండే వైరస్‌పై కూడా పోరాడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ ప్రయోగం ఎప్పటికి పూర్తవుతుంది? మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనేదానిపై ఇంకా స్పష్టత లేదు.


Tags

Next Story