ఇక ఎవ్వరూ తప్పించుకోలేరు! లాక్‌డౌన్, కర్ఫ్యూ స్టేజ్ దాటేసిన కరోనా..!

ఇక ఎవ్వరూ తప్పించుకోలేరు. జాగ్రత్తగా ఉండకపోతే కరోనా కాటేయడం ఖాయం. లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు అనే స్టేజ్ దాటిపోయింది. మే నెల గడిచేసరికి మరో పాతిక లక్షల మందికి కరోనా సోకడం ఖాయం. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనం చెబుతున్న వాస్తవాలివి. ఎండాకాలం వచ్చేస్తోంది కాబట్టి ఇక కరోనా తగ్గుముఖం పట్టొచ్చు అనుకున్నారు. కాని, ఎండ పెరిగి ఇప్పుడిప్పుడే వడగాలులు వీస్తున్న సమయంలోనే వైరస్ మరింత విజృంభిస్తోంది. గత సెప్టెంబర్ 11న 97వేల కేసులు నమోదయ్యాయి. చలికాలం ప్రారంభమైన తరువాత వైరస్ వేగం తగ్గింది. మొన్న జనవరి 25న అతి తక్కువగా 9వేల కేసులే నమోదయ్యాయి. 97వేలకి 9వేలకి ఎక్కడా పోలికే లేదు. కాని, చలి తగ్గి ఎండ పెరుగుతున్న కొద్దీ వైరస్ విజృంభిస్తోంది. ఇక ఏప్రిల్, మే నెలలో అయితే కరోనా కట్టలు తెంచుకోవడం ఖాయం అంటున్నాయి అధ్యయనాలు. సో, ఎండాకాలంలో కరోనా వైరస్ ఏమీ చేయదు అనుకునే వారికి ఇదొక హెచ్చరిక అంటున్నారు వైద్య నిపుణులు.
మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. కాని, పక్కనున్న మహారాష్ట్ర, కర్నాటకలో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. అక్కడి నుంచి వచ్చే వాళ్ల కారణంగానూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మనవాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వస్తుండడం, వాళ్లు మన రాష్ట్రాల్లోకి వస్తుండడం, అంతర్జాతీయ రాకపోకలు పెరగడం, కరోనా నిబంధనలను సీరియస్‌గా పాటించకపోవడంతో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ఈనెల మొదట్లో వంద, 150 ఉన్న కేసులు ఇప్పుడు 500లకు చేరువయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో పది రోజుల క్రితం వరకు 29 పాజిటివ్‌లే నమోదయ్యాయి. ఇప్పుడు 138కి చేరాయి. గత వారంరోజుల్లో దాదాపు 70 శాతం కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ సహా రంగారెడ్డి, మల్కాజిగిరి, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది.
భారత్‌లో సెకండ్‌వేవ్ మొదలైనట్టే కనిపిస్తోంది. దీని ఉధృతి కనీసం వంద రోజుల పాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరో 20 రోజుల్లో ఇప్పుడు నమోదవుతున్న కేసులు రెట్టింపు అవుతాయని కూడా హెచ్చరిస్తున్నారు. సెకండ్‌వేవ్ ఎంత ఉధృతంగా ఉంటుందనడానికి గణాంకాలే సాక్ష్యం. గతేడాది కరోనా కేసులు 20వేల నుంచి 50వేలకు పెరగడానికి 32 రోజులు పట్టింది. కాని, సెకండ్‌వేవ్‌లో జస్ట్ 14 రోజుల్లోనే 50వేల కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి.. కరోనా ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు.
వచ్చే రెండు మూడు నెలల్లో కొత్తగా పాతిక లక్షల కేసులు నమోదవుతాయనడం మామూలు విషయం కాదు. అందుకే, మాస్కులు పెట్టుకోవడం, దూరం పాటించడం మినహా కరోనాను కట్టడి చేసే మరో మార్గం లేదంటున్నారు. ముఖ్యంగా సిటీల్లో ఉండే వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా విజృంభిస్తుండడంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రూల్ నడుస్తోంది. బెంగళూరులోకి ఇతర రాష్ట్రాల వాళ్లు రావాలంటే కరోనా నెగటివ్ రిపోర్ట్ చేతిలో ఉండాల్సిందే. ఇక మహారాష్ట్రలో అయితే ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ నడుస్తోంది. చాలా రాష్ట్రాల్లో రాత్రిళ్లు కర్ఫ్యూ పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com