శీతాకాలం.. కరోనా వైరస్‌కి అనువైన కాలం: నీతి ఆయోగ్ హెచ్చరిక

కరోనా వైరస్ కేసులు శీతాకాలంలో మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటున్నాయంటున్నారు నిపుణులు. మహమ్మారి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు గడిచినా ఏ మాత్రం కేసులు తగ్గుముఖం పట్టక పోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వైరస్ ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా సంభవిస్తాయి. దీంతో కోవిడ్ కేసులు కూడా పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. "రాబోయే రెండు-మూడు నెలలు చాలా ముఖ్యమైనవి. పండుగల సీజన్ సమీపిస్తున్నప్పటికీ ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కుల వాడకాన్ని కచ్చితం చేయాలి. సామాజిక దూరాన్ని కొనసాగించాలి "అని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిపై కాలానుగుణ మార్పులు పెద్దగా ప్రభావం చూపలేదని గతంలో నిపుణులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, శీతాకాలం సమీపిస్తున్నప్పుడు, నిపుణులు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేశ జనాభాలో 90 శాతానికి పైగా ప్రజలు సంక్రమణకు గురవుతారని హెచ్చరించిన డాక్టర్ పాల్ ఇప్పుడు దృష్టంతా పరీక్షల నిర్ధారణపై పెట్టవలసి ఉందన్నారు. పరీక్షల సామర్థ్యాన్ని 15 లక్షలకు పెంచామని, కోవిడ్ -19 పరీక్షల సంఖ్య రోజుకు 50 వేలు దాటిందని, గత వారంలో దాదాపు 78 లక్షల పరీక్షలు జరిగాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com