Covid Vaccine: ఆగస్టులోనే వారికి టీకాలు..!

Covid Vaccine
Covid Vaccine: 18ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ...దేశవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇదే సమయంలోం చిన్నారుల కోసం టీకాను సైతం సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ముఖ్యంగా వచ్చే నెలలోనే చిన్నారుల టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులోనే చిన్నారులకు టీకాల కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని బీజేపీ ఎంపీల సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇచ్చిన సంకేతాలతో తెలుస్తోంది.
ఇప్పటికే చిన్నారుల టీకా కోసం...భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సంస్థలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. 12-18 ఏళ్ల వయసు వారికోసం జైడస్ క్యాడిలా ఇప్పటికే ప్రయోగాలు సైతం పూర్తి చేసింది. భారత్ బయోటెక్ మాత్రం 2 నుంచి 18ఏళ్ల వయసు పిల్లలపై మూడో దశ ప్రయోగాలను...మూడు దశల్లో నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా 6 ఏళ్లకు పైబడిన వారికి రెండు డోసులు ఇచ్చి పరీక్షించింది.
ఈ పరీక్ష ఫలితాలు త్వరలోనే వెల్లడి కానుండడంతో పాటు వ్యాక్సిన్ కూడా సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్‌కే అరోరా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అటు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా...సెప్టెంబర్‌లో చిన్నారులకు టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
మోడెర్నా, ఫైజర్ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను 12ఏళ్ల వయసుపైబడిన వారికి ఇచ్చేందుకు అటు అమెరికా ఇటు యూరప్ దేశాలు అనుమతి మంజూరు చేశాయి. ఆయా దేశాల్లో చిన్నారులకు టీకా పంపిణీ సైతం మొదలయ్యింది. మన దేశంలోనూ వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతోంద్న కేంద్ర ఆరోగ్యశాఖ...ఇప్పటివరకు 18ఏళ్ల పైబడిన వారికి 44 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com