Crime-UP: తండ్రి నట్టేట ముంచాడు; అక్క ప్రాణాలకు తెగించి కాపాడింది..

Crime-UP: తండ్రి నట్టేట ముంచాడు; అక్క ప్రాణాలకు తెగించి కాపాడింది..
నలుగురు చిన్నారులను నీట ముంచి చంపాలనుకున్న తండ్రి; సమయస్ఫూర్తితో ఇద్దరు తోబుట్టువులను కాపాడుకున్న చిన్నారి; ఆచూకీ లేని మరో చిన్నారి...

ఆపద వస్తే ఆదుకోవాల్సిన చేతులే నట్టేట ముంచేసరికి ఆ పసి ప్రాణాలు అల్లల్లాడిపోయాయి. తండ్రి చేసిన నమ్మక ద్రోహానికి తన తోబుట్టువులు బలైపోతుంటే ఆ చిన్నారి చూడలేకపోయింది. సమయస్ఫూర్తితో నట్టేట కొట్టుకుపోతున్న అన్నను, చెల్లిని ప్రాణాలకు తెగించి రక్షించుకుంది. ఇంత చేసినా చిన్నారి చిట్టిచెల్లిని రక్షించుకోలేకపోయానని బావురుమంటోంది ఆ 12ఏళ్ల బాలిక... ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఖాస్ గంజ్ జిల్లాలోని షహావర్ పోలీస్ స్టేషన్ పరిథిలో చోటుచేసుకుంది.


షేక్ పూర్ హుందాకు చెందిన పుష్పేందర్ కుమార్ భార్యతో గొడవపడి ఊరికి 15కి.మీ. దూరంలోని గుడికి తీసుకువెళతానంటూ తన నలుగురు చిన్నారులను తీసుకుని బయలుదేరాడు. సోనూ(13), ప్రభ(12), కాజల్(8), హేమలత(5)లను ఆటోలో ఎక్కించుకుని సగం దూరం చేరుకున్నాడు. బండి కెనాల్ దగ్గరకు రాగానే వంతెన పై నుంచి నీటిని చూపిస్తానంటూ చిన్నారులందరినీ పిట్టగోడ మీదకు ఎక్కించాడు. నీళ్లలోతు ఎంతుంటుంది నాన్నా అని చిన్నారులు ముద్దుముద్దుగా అడిగే లోగానే వరుసగా అందరినీ నీళ్లలోకి నెట్టేసి పరారయ్యాడు.


తండ్రి నీళ్లలోకి నెట్టేసిన విషయం అర్థమయ్యేలోగానే చిన్నారులు అందరూ కొట్టుకుపోతున్నారు. ఈ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన ప్రభ ముందుగా నీళ్లలో తన పక్కనే పడిన కాజల్ ను చేయిపట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేర్చింది. ఇంతలో అన్న నీళ్లలో ఊపిరాడకుండా కొట్టుకోవడం చూసిన ప్రభ వెంటనే అతడివద్దకు వెళ్లి ఎలాగోలా దొరకబుచ్చుకుని వంతెన గట్టువద్దకు వెళ్లి నిలదొక్కుకుంది. ఈ క్రమంలో మరో చిన్నారి హేమలత(5)ఆచూకీ కానరాకుండా పోయింది.


అక్కడితో ఆగకుండా, బిగ్గరగా కేకలు వేస్తూ అటువైపు గా పోయేవారికి సహాయం చేయాల్సిందిగా వేడుకుంది ప్రభ. ఇది గమనించిన స్థానికులు చిన్నారులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీసులు పుష్పిందర్ ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే ఈ పనికి పాల్పడ్డానని అంగికరించగా, అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.


ఏమైనా అత్యంత ధైర్య సాహసాలు కనబరిచి తోబుట్టువులను కాపాడుకున్న ప్రభ, తన చిట్టి చెల్లెలు కూడా తిరిగి వస్తుందని గంపెడు ఆశతో ఎదురుచూస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story