జర జాగ్రత్త సోదరా.. ఖాతాలో ఎంతున్నా ఖాళీ చేసేస్తున్నారు

జర జాగ్రత్త సోదరా.. ఖాతాలో ఎంతున్నా ఖాళీ చేసేస్తున్నారు
ప్పుడంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. దొంగతనం కూడా స్మార్ట్‌గానే ఉంటుంది మరి. టెక్నాలజీ తెచ్చిన తెలివితేటలతో

తాళాలు పగల కొట్టక్కర్లేదు.. పర్సులు కొట్టేయక్కర్లేదు. ఇప్పుడంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. దొంగతనం కూడా స్మార్ట్‌గానే ఉంటుంది మరి. టెక్నాలజీ తెచ్చిన తెలివితేటలతో కాలు కదపకుండా, కత్తులు కటార్లు వంటి ఆయుధాలు లేకుండా ఉన్న చోటు నుంచే అకౌంట్‌లో డబ్బులు మాయం చేస్తున్నారు. ఒక్క ఏడాదిలో దేశంలో దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా నగదును సైబర్ నేరగాళ్లు దోచుకున్నారని అంచనా. బ్యాంకులు, సాప్ట్‌వేర్ సంస్థలేకాదు గ్రామీణ ప్రాంతాల్లోని వారు కూడా సైబర్ నేరాల బారిన పడుతున్నారు. అందరి చేతిలో స్మార్ట్ ఫోన్.. ఏవో మెసేజ్‌లు.. పొరపాటున క్లిక్ చేస్తే అంతే సంగతులు. కొంత అవగాహన ఉండడం ఎంతైనా అవసరం.. అప్రమత్తంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు..

వాయిస్ క్లోనింగ్..

క్రెడిట్ కార్డు, సిమ్ కార్డుల క్లోనింగ్ దశలను దాటి ఇప్పుడు కొత్తగా వాయిస్ క్లోనింగ్‌కు పాల్పడుతున్నారు. ఇటీవల ఇంగ్లండులో ప్రముఖ సంస్థకు చెందిన సీఈవో గొంతు క్లోనింగ్ చేశారు. అచ్చంగా ఆయనలా మాట్లాడి ఫలానా సంస్థకు బకాయిలు చెల్లించాలని చెబుతూ అకౌంట్ మేనేజర్‌‌ని బురిడీ కొట్టించి రూ.కోట్లు కొల్లగొట్టారు. డబ్బు ట్రాన్ప్‌ఫర్ చేసిన తరువాత ఆ విషయం తెలిసి మోసపోయామని గ్రహించారు. వ్యాపార సంస్థలే లక్ష్యంగా ఈ తరహా మోసాలు సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో కొడుకు తండ్రికి ఫోన్ చేసి డబ్బు పంపమని అడగొచ్చు. అందుకే వచ్చే ప్రతి కాల్‌ని అనుమానించాల్సిందే. డబ్బులు పంపమని వచ్చే కాల్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.

మరో కొత్త తరహా మోసం స్మిషింగ్.. క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు పొందాలంటే ఈ దిగువ లింక్‌ను క్లిక్ చేయాలని సంక్షిప్త సందేశం వస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీ క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బులు ఖాళీ. మోసపోతున్నామనే విషయం తెలియకుండా బుట్టలో పడేస్తారు.. క్రెడిట్ కార్డు నెంబరు, కార్డు గడువు ముగిసే తేదీ, సీవీవీ నెంబరు పేర్కొనాలని అప్పుడే పాయింట్లు వస్తాయని సందేశం కనిపిస్తుంది. అన్నీ నమోదు చేశాక ఒక పిన్ నెంబరు వస్తుందని, దాన్ని కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేసే వారికి చెప్పాలని అప్పుడే పాయింట్లు వస్తాయని మెసేజ్ వస్తుంది. అన్నీ చేసి చూసుకుంటే ఈలోపు అకౌంట్ సున్నా.

వివరాలు నింపొద్దు, పంపొద్దు.. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఎవరికీ చెప్పొద్దు. సీవీవీ నెంబరును ఎవరితోనూ పంచుకోవద్దు. పిన్ నెంబర్ ఎవరికీ చెప్పకూడదు.

వ్యాపార సంస్థకు, దానికి సరుకుని సరఫరా చేసే డీలర్ల మధ్య కూడా సైబర్ నేరగాళ్లు చొరబడుతున్నారు. కొన్ని కారణాల వల్ల తమ బ్యాంకు ఖాతా మార్చుకున్నామని, తమకు చెల్లించవలసిన మొత్తాన్ని కొత్త ఖాతాకు బదిలీ చేయాలని అందులో పేర్కొంటారు. తమ డీలర్ నుంచే మెయిల్ రావడంతో ఏ మాత్రం అనుమానం రాదు వ్యాపార సంస్థకు దాంతో నగదు బదిలీ చేసి మోసపోతున్నారు.

వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారు తమ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అత్యంత భద్రంగా చూసుకోవాలి. సమాచార చౌర్యానికి పాల్పడే యాప్‌లు ఉంటాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకుంటే కీలక సమాచారం చోరీ అయినట్లే. నగదు లావాదేవీల విషయంలో ఇరు వర్గాలు ఫోన్‌లో సంప్రదించుకుని నిర్ధారణ చేసుకోవాలి.

ఖాతాదారుడి గురించి తెలుసుకునేందుకు బ్యాంకులు పాటిస్తున్న కేవైసీ నిబంధన సైబర్ నేరగాళ్లకు ఓ వరంలాటిదే. వినియోగదారులకు ఫోన్ చేసి, కేవైసీ వివరాలు నమోదు చేయాలని, లేకపోతే వాలెట్ సేవలు నిలిపివేస్తామంటారు. వివరాల కోసం లింకు పంపుతారు. దాన్ని తెరవగానే టీం వ్యూయర్, ఎనీడెస్క్ వంటి సాప్ట్‌వేర్‌లు లోడ్ అవుతాయి. ఆ క్షణం నుంచి మీ ఫోన్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లినట్లే. కేవైసీ అప్‌డేట్ పేరుతో డెబిట్/క్రెడిట్ కార్డు నంబర్లతో పాటు సీవీవీ నంబర్‌నూ నమోదు చేయాలంటారు. అప్పటికే బాధితుల ఫోన్ నేరగాళ్ల ఆధీనంలో ఉంటుంది కాబట్టి దానికి వచ్చే ఓటీపీలు వారికి కనిపిస్తుంటాయి. వాటి ద్వారా ఖాతాల్లోని డబ్బు గోవిందా.

గుర్తుంచు కోవలసినవి.. ఏ బ్యాంకూ ఆన్‌లైన్లో కేవైసీ వివరాలు అడగదు. కేవైసీ వివరాల నమోదుకు డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు అవసరం లేదు.

మరో మోసం.. వాహన కొనుగోళ్ల వ్యవహారం.. ఆనలైన్‌లో ప్రకటన పెట్టగానే సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తారు. తాము కొంటామంటారు. వాహనం ఆర్సీ, యజమాని ఆధార్ కార్డు వంటివి పంపాలని కోరతాడు. ఆ తర్వాత ఓ పదివేలు అడ్వాన్స్ ఇస్తున్నానంటూ నేరగాడు ఒక క్యూఆర్ కోడ్ పంపుతాడు.. దాన్ని తెరిస్తే డబ్బు జమ అవుతుందంటాడు. అమ్మకందారు ఆ క్యూఆర్ కోడ్ తెరవగానే లావాదేవీ కొనసాగించాలా అని అడుగుతుంది. డబ్బు అకౌంట్ ‌లో పడుతుంది కదా అని యజమాని సరే అంటాడు. ఆ వెంటనే అతని ఫోన్‌లో ఉన్న యూపీఐ యాప్ ద్వారా రూ.10వేలు సైబర్ నేరగాడి ఖాతాలో జమ అవుతాయి. ఆ విషయం సైబర్ నేరగాడికి చెబితే పొరపాటు జరిగిందని, ఆ రూ.10 వేలకు మరో రూ.10 వేలు కలపి రూ.20 వేలు ఇస్తానని చెబుతూ మరో క్యూ ఆర్ కోడ్ పంపుతాడు. దాన్ని తెరిస్తే మరో రూ.20 వేలు గల్లంతయినట్లే. ఈ కథ అంతటితో ముగిసిపోదు. వాహనం ఆర్పీ, ఆధార్ కార్డు వివరాలతో మరో మోసానికి తెరలేపుతాడు.

అందుకే వాడిన వస్తువులు అమ్మే ప్రకటనలను ఆన్‌లైన్‌లో చూసి తొందరపడవద్దు. డబ్బు చెల్లిస్తున్నామని చెబుతూ ఎవరైనా క్యూఆర్‌కోడ్ పంపితే తెరవొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పొద్దు.

Tags

Next Story