Cyclone: మరో అల్పపీడనం.. వాతావరణ శాఖ వెల్లడి

Cyclone: మరో అల్పపీడనం.. వాతావరణ శాఖ వెల్లడి
Cyclone: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు మరో అల్పపీడనం బంగాళాఖాతంలో కాచుక్కుర్చుంది. రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Cyclone: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు మరో అల్పపీడనం బంగాళాఖాతంలో కాచుక్కుర్చుంది. రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మాండూస్‌ తుఫాన్‌ ఏపీ, తమిళనాడులో భారీ ఎఫెక్ట్ చూపిస్తోంది. వానలు, ఈదురుగాలులతో వణికిస్తోంది. ఇప్పుడా ఎఫెక్ట్ తెలంగాణపై కూడా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు చలి తీవ్రత పెరుగుతోందని వెల్లడించింది.


మరోవైపు మాండూస్ తుఫాన్ ఏపీ రైతులకు కంటతడి పెట్టిస్తోంది. ధాన్యం కొనుగోళ్ళు లేక గత 20 రోజులుగా రోడ్లపైనే ధాన్యం పోసుకుని రైతన్నలు వాటి అమ్మకం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయదు, మిల్లర్లు తీసుకోరు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్న రైతులపై మండూస్ తుఫాన్ విరుచుకుపడింది. రోడ్ల పై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయిపోతుంటే తల్లడిల్లి పోతున్నారు.. రెక్కల కష్టాన్ని కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు.. అయితే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి, బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.


నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో మూడు రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. దీంతో నిమ్మ పంట జలమయమైంది. అటు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి పాములు వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు.


నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో కురిసిన వానలకు వాగులు, వంకలు అలుగుపోస్తున్నాయి. ఏఎస్ పేట మండలం తెల్లపాడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే రాజవోలు చెరువు అలుగుపై వేసిన మట్టికట్ట భారీ వర్షానికి కొట్టుకుపోయింది. మరోవైపు సోమశిల జలాశయం నుంచి డెల్టాకు నీటిని విడుదల చేయడంతో కొమ్ములేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.


రెండు రోజులుగా హైదరాబాద్‌తో పాటు, చుట్టుపక్కల జిల్లాలో చల్లటి వాతావరణానికి దట్టమైన మేఘాలు తోడయ్యాయి. మరోవైపు చినుకులు కూడా ముప్పేట దాడిచేయడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు..


ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత కాస్త తగ్గిన.. మెదక్ జిల్లా టెక్క్మాల్ లో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లా హబ్సిపూర్ లో 18.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. సంగారెడ్డి జిల్లా అల్మాయిపేటలో 18.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


నిజామాబాద్ జిల్లాలో చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తుఫాన్ ప్రభావంతో పగటిపూట ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. డోన్‌లో అత్యల్పంగా 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. గాంధారి, బిచ్కుంద, బీర్కూర్, జుక్కల్ మండలాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

Tags

Next Story