భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 'నివర్' తుఫాన్ హెచ్చరికలు..

భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నివర్ తుఫాన్ హెచ్చరికలు..
మంగళవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది.

ఇప్పటికే అరేబియా సముద్రంలో 'గతి' తుఫాను తీవ్రత కొనసాగుతోంది.. ఇప్పుడు తాజాగా మరో తుఫాను ముంచుకొస్తోందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం సోమవారానికి వాయుగుండంగా మారి మంగళవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్‌కు నివర్ అనే పేరును ఇరాన్ సూచించింది.

అల్పపీడనం తుఫానుగా మారిన అనంతరం ఈనెల 25న తమిళనాడు, పుదుచ్చేరి తీరాన కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రత్యేకించి తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొస్తాంధ్రలో ఇప్పటికే వర్షప్రభావం ఉండగా, రాయలసీమ జిల్లాలో మంగళవారం నుంచి, తెలంగాణలో బుధవారం నుంచి వర్షాలు మొదలవనున్నట్లు వెల్లడించారు.

ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 45 కి.మీ నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను ప్రభావం మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంటుందని తెలిపారు వాతావరణ అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story