Delhi: జర్నలిస్టు సిద్ధికి కప్పన్‌కు బెయిల్‌

Delhi: జర్నలిస్టు సిద్ధికి కప్పన్‌కు బెయిల్‌
యూపీ ప్రభుత్వం తరపు న్యాయవాదిపై సీజేఐ ధర్మాసనం ప్రశ్నల వర్షం

జాతీయ జర్నలిస్టు సిద్ధికి కప్పన్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చింది. మలయాళ వార్తా పోర్టల్‌ అజిముఖం రిపోర్టర్‌, కేరళ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఢిల్లీ యూనిట్‌ మాజీ కార్యదర్శి కప్పన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం విచారించింది. ఉత్తరప్రదేశ్ తరుపున న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదించగా.. సిద్ధికి తరుపున న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరపు న్యాయవాదిపై సీజేఐ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రతి పౌరుడికీ భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం ఉందని తెలిపింది. బాధితురాలికి న్యాయం జరగాలని గొంతెత్తడం చట్టం దృష్టిలో నేరమా? అంటూ ప్రశ్నించింది. హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. నాటి ఈ ఘటనకు వ్యతిరేకంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ జర్నలిస్ట్ సిద్ధికి కప్పన్ గొంతెత్తారు. దాంతో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద యూపీ పోలీసులు కప్పన్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం యూపీ పోలీసులు దాఖలు చేసిన కేసులో సిద్ధికి కప్పన్‌ రెండేళ్లుగా జైలులో ఉన్నారు. సుప్రీంకోర్టు విధించిన షరతులకు లోబడి బెయిల్‌పై విడుదల చేయడానికి వీలుగా మూడు రోజుల్లోగా ట్రయల్‌ కోర్టు ముందు కప్పన్‌ను హాజరు పరచాలని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story