Delhi Air Pollution: ఢిల్లీ గాలి కాలుష్యంతో ప్రజల ప్రాణాలకే ముప్పు అని..

Delhi Air Pollution (tv5news.in)
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన వాయు కాలుష్యం హడలెత్తిస్తోంది. ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్న వాయుకాలుష్యంతో హస్తినా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా నవంబర్ నెలలోనే గాలి కాలుష్యం తీవ్రంగా అలుముకుంటోంది. గత వారం రోజుల నుంచి ఢిల్లీలో వాతావరణ సాధారణస్థాయి కంటే దిగువకు పడిపోయింది.
ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు వాహనదారులు. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పలు విమాన, రైలు సర్వీసులను రద్దు చేశారు. ఢిల్లీలో వాయుకాలుష్య నివారణకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయినా గాలి కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో శనివారం సీఎం కేజ్రీవాల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేజ్రీవాల్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నవంబర్ 15 నుంచి ఢిల్లీలో పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని సూచించింది. ప్రభుత్వ కార్యాలయాలు ఒక వారం పాటు వర్క్ ఫ్రమ్ హోం పనిచేయాలని తెలిపింది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో నిర్మాణ పనులు నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. మరో రెండ్రోజుల పాటు ఇలాగే ఉంటే ఢిల్లీలో లాక్‌డౌన్ విధించే యోచనలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీలో కాలుష్య నివారణలో కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కాలుష్య నియంత్రణపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని బెంచ్... కేంద్ర సర్కారుకు అనేక సూటి ప్రశ్నలు సంధించింది. పంట వ్యర్థాలను తగుల బెట్టేందుకు కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వంకానీ, రైతులకు మిషన్లు సమకూర్చాలని సూచించింది. ఇప్పటికైనా ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com