Delhi Farmers Protest: కేంద్రం హామీతో ముగిసిన ఢిల్లీ రైతుల ఉద్యమం..

Delhi Farmers Protest: మూడు వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుధీర్ఘ కాలంగా సాగిన రైతుల ఉద్యమం ముగిసింది. నూతన సాగుచట్టాలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించడంతో ఆందోళనలను తాత్కాలికంగా విరమించాయి. రైతుల డిమాండ్లను నెరవేస్తామంటూ కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేసేందుకు రైతు సంఘాలు సుముఖత వ్యక్తంచేశాయి.
రెండ్రోజుల్లో ధర్నా ప్రాంతం నుంచి స్వస్థలాలకు తరలిపోతామని కిసాన్ సంయుక్త మోర్చా తెలిపింది. అయితే డిమాండ్లు పూర్తిగా నెరవేరలేదని.. ఆందోళనలు ఈ నెల 15 వరకు వాయిదా వేస్తున్నట్లు రాకేష్ టికాయత్ స్పష్టంచేశారు. వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధర చట్టబద్ధతపై కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది.
కమిటీలో రైతు సంఘాల నేతలు కూడా ఉంటారని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఆ తర్వాత రైతులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకుంటామని కేంద్రం మరో హామీ ఇచ్చింది. దీంతో ఉద్యమానికి విరామం ఇచ్చిన రైతులు.. సింఘు సరిహద్దులో విజయోత్సవ ప్రార్థనను నిర్వహించారు. ఈనెల 11న ఉదయం నిరసన స్థలాల వద్ద విజయోత్సవ కవాతు, 13న పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020 సెప్టెంబర్ 25న రైతులు కదం తొక్కారు. దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాల నేతలు.. చలో ఢిల్లీ పేరుతో ఆందోళనను ఉధృతం చేశారు. ఈ పోరాటంలో దాదాపు 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు.. పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించినా చెక్కుచెదరకుండా ఉద్యమాన్ని కొనసాగించారు.
వ్యవసాయ చట్టాల్లో సవరణలకు కేంద్రం పంపిన ప్రతిపాదనలు అసంబద్ధంగా ఉండటంతో రైతులు తిరస్కరించారు. తర్వాత సుప్రీంకోర్టును రైతులు ఆశ్రయించారు. వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. చివరికి రైతుల ఉద్యమంతో దిగొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు. పార్లమెంట్‌లోను సాగు చట్టాల సవరణ బిల్లు రద్దుకు ఆమోదం తెలిపింది. మొత్తానికి సుధీర్ఘ కాలంగా సాగిన రైతుల ఉద్యమానికి తెరపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com