Delhi Liquor Scam: ఐదు రోజుల సీబీఐ కస్టడీకి సిసోడియా

Delhi Liquor Scam: ఐదు రోజుల సీబీఐ కస్టడీకి సిసోడియా
ఇప్పటికే కేసు విచారణ కీలక దశకు చేరిన నేపథ్యంలో సిసోడియా కస్టడీలో మరింత కీలక సమాచారం బయటకు రావచ్చని భావిస్తున్న అధికారులు

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టైన డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను సీబీఐ తన కస్టడీలోకి తీసుకోనుంది. ఐదు రోజులపాటు పూర్తిస్థాయిలో ఆయన్ను విచారించనున్నారు. లిక్కర్‌ పాలసీ తొలి డ్రాఫ్ట్‌లో లేని ఆరు వివాదాస్పద నిబంధనల గురించి ప్రశ్నించనున్నట్లు సమాచారం. అదేవిధంగా నూతన మద్యం విధానానికి సంబంధించిన కీలక ఫైళ్లు ఏమయ్యాయి..? అందులో ఏముంది..? అని క్వశ్చన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అన్ని ఫోన్లు ఉపయోగించారనే ప్రశ్నలను కూడా సిసోడియాను సీబీఐ అధికారులు అడుగనున్నారు. ఇప్పటికే కేసు విచారణ కీలక దశకు చేరిన నేపథ్యంలో మనీష్‌ సిసోడియా కస్టడీలో మరింత కీలక సమాచారం బయటకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు.

సిసోడియాకు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. దీంతో మార్చి 4వ తేదీ వరకు ఆయన సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు. ఇందులో భాగంగా సిసోడియాను ఇవాళ సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసులో మనీష్‌ సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు కోర్టు ఆదేశాలతో ఆయన్ను కస్టడీకి తీసుకోనున్నారు.

ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో సిసోడియాను ఏ వన్‌ నిందితుడిగా సీబీఐ పేర్కొంది. మద్యం విధానం కోసం రూపొందించిన డ్రాఫ్ట్‌ నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోడియా తొలగించారని ఆరోపించింది. సిసోడియా తమ ప్రశ్నలకు ఎగవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు ముందుకెళ్లాలంటే ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. దీంతో కోర్టు అనుమతి ఇచ్చింది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో సీబీఐ సిసోడియాను ఆదివారం అరెస్టు చేసింది. సుమారు 8 గంటల పాటు ప్రశ్నించినా ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాలేదని సీబీఐ అధికారులు అంటున్నారు. దీంతో మరోసారి విచారణ చేపట్టనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story