Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సంచలనాలు.. కొద్ది రోజుల్లో ఊహించని మలుపులు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సంచలనాలు.. కొద్ది రోజుల్లో ఊహించని మలుపులు
Delhi Liquor Scam:

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సంచలనాలు జరగబోతున్నాయా? వచ్చే కొద్ది రోజుల్లోనే ఊహించని మలుపులు చూడబోతున్నామా? తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వరకు ఎవరిని కదిపినా ఇదే మ్యాటర్ మాట్లాడుకుంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో సీఎం కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు విచారించారన్న వార్త దేశవ్యాప్తంగా హైలెట్‌ అయింది. అందులోనూ మరోసారి నోటీసులు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవిధంగా ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరో షాక్‌ ఇచ్చినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వడం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు జరుగుతాయంటున్నారు విశ్లేషకులు.


త్వరలోనే మళ్లీ కవితను ప్రశ్నించనుంది సీబీఐ. తాము చెప్పిన చోట హాజరుకావాలని, అడిగిన పత్రాలు, ఆధారాలు ఇవ్వాలని సీబీఐ నోటీసులు పంపింది. తేదీ, స్థలం వివరాల గురించి త్వరలోనే మెయిల్ ద్వారా సమాచారం ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు సీబీఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిన్న సీబీఐ అధికారులు ఏడున్నరగంటలపాటు ప్రశ్నించారు. స్టేట్‌మెంట్‌ తీసుకుంటామని మొదట నోటీసులు ఇచ్చిన సీబీఐ.. కవిత ఇంట్లోనే వివరాలు సేకరించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారని అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. దీంతో ఈ అంశంపైనే ఎక్కువ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.


ఇక సీబీఐ విచారణ ముగిసిన వెంటనే ఎమ్మెల్సీ కవిత.. మంత్రి తలసాని శ్రీనివాస్, ఇతర నేతలతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. సీబీఐ విచారణకు సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్‌కు కవిత వివరించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నేరుగా ఆమె తన నివాసం చేరుకున్నారు కవిత. అయితే, సీబీఐ విచారణపై కవిత మీడియాతో మాట్లాడుతారని అనుకున్నప్పటికీ.. ఆమె స్పందించలేదు. దీనిపై ఏదైనా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించడం.. ప్రతిపక్షాలకు ఒక ఆయుధంలా దొరికింది. కవిత ఇంటికి సీబీఐ అధికారులు ఛాయ్ బిస్కెట్ల కోసం రాలేదంటూ తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో లక్షల కోట్లు దోచుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కవిత ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా? ఇంటి దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఎందుకు అంటూ కామెంట్ చేశారు. తప్పు చేసి కూడా హోర్డింగ్స్ పెట్టుకుంటున్నారని విమర్శించారు. తప్పు చేసిన అధికార పార్టీ నేతలంతా జైలుకు వెళ్లాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. లిక్కర్ స్కాం కేసులో కవిత దొరికిపోయారని, చట్టం తన పని తాను చేస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story