సాయం చేస్తానని నమ్మించింది.. లక్ష రూపాయలకు వివాహితను అమ్మేసింది

సాయం చేస్తానని నమ్మించింది.. లక్ష రూపాయలకు వివాహితను అమ్మేసింది
ఇద్దరు పిల్లలతో ఉన్న ఆమెను చూసి ఓ వృద్ధురాలు పలకరించింది. మాయమాటలు చెప్పి మహారాష్ట్రలోని పర్బణీకి తీసుకువెళ్లింది.

అయిదేళ్ల క్రితం పెళ్లైంది.. ఇద్దరు పిల్లలు.. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు.. దూరంగా వెళిపోతే బాగా బతకొచ్చనుకుందేమో ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆటో ఎక్కింది. 9నెలల పాటు నరకయాతన అనుభవించింది. సిరిసిల్ల జిల్లా వేముల వాడకు చెందిన ఆమెకు మార్చిలో భర్తతో గొడవ జరిగింది.

మనస్తాపానికి గురైన ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆటోలో కామారెడ్డి చేరుకుని అక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. రెండ్రోజుల నుంచి అక్కడే ఇద్దరు పిల్లలతో ఉన్న ఆమెను చూసి ఓ వృద్ధురాలు పలకరించింది. మాయమాటలు చెప్పి మహారాష్ట్రలోని పర్బణీకి తీసుకువెళ్లింది.

అక్కడ మోరా అనే వ్యక్తికి లక్షరూపాయలకు ఆమెను అమ్మేసింది. అతడు రాజారామ్ అనే మరో వ్యక్తికి అమ్మేసాడు. అతడు నాసిక్ సమీపంలోని ఓ కుగ్రామానికి చెందిన బాబు లక్ష్మణ్ జగపత్ అనే వ్యక్తికి అప్పగించాడు. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న లక్ష్మణ్ జగపత్.. మూడో భార్యగా ఉండాలంటూ బాధితురాలిని వేధించాడు.

తాను మోసపోయానని గ్రహించిన ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది.. దీన్ని పసిగట్టిన లక్ష్మణ్ పారిపోతే ఇద్దరు పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. ఆమెకు ఫోన్ కూడా అందుబాటులో లేకుండా చేశాడు. ఎట్టకేలకు ఫోన్ సంపాదించిన బాధితురాలు ఈనెల 25న బంధువులకు సమాచారం ఇచ్చింది.

ఆమె భర్త వేములవాడ పట్టణ సీఐకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలు ఉన్న ప్రాంతాన్ని సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించి మంగళవారం అక్కడికి చేరుకున్నారు. బాధితురాలికి విముక్తి కల్పించి.. లక్ష్మణ్ జగపత్‌ను అరెస్ట్ చేశారు.

Tags

Next Story