చొట్టనిక్కర గుడికి 700 కోట్ల రూపాయలు దానంగా ఇచ్చిన భక్తుడు

చొట్టనిక్కర గుడికి 700 కోట్ల రూపాయలు దానంగా ఇచ్చిన భక్తుడు

చేతికి ఎముక లేకపోవడం అంటే ఇదేనేమో. ఈయన పేరు గానశ్రవణ్. బెంగళూరులో బంగారం వ్యాపారి. మనసు కూడా బంగారమే. గానశ్రవణ్ సంగీత విధ్వాంసుల కుటుంబంలో పుట్టారు. ఐదేళ్ల క్రితం ఈయన గురువు కేరళ రాష్ట్రంలోని చొట్టనిక్కర గుడి గురించి చెప్పారు. ఆ అమ్మవారిని కొలిచినప్పటి నుంచి ఈయన బంగారం వ్యాపారం బెంగళూరు నుంచి దేశవిదేశాలకు ఎదిగింది. అందుకే, సంపాదించిన దాన్లో కొద్ది మొత్తాన్ని ఈ గుడికి, ఇతర సేవా కార్యక్రమాలకు ఇవ్వాలనిపించింది. అనుకున్నదే ఆలస్యం 700 కోట్ల రూపాయలు రాసిచ్చేశాడు.

చొట్టనిక్కర దేవాలయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేరళలోని అందమైన గ్రామాల్లో ఒకటి ఈ చొట్టనిక్కర. ఇక్కడ భగవతి అమ్మవారు వెలిశారు. ఈమె త్రిశక్తి స్వరూపిణి. ఉదయం సరస్వతిగా, మధ్యాహ్నం లక్ష్మీదేవిగా, సాయంత్రం దుర్గామాతగా దర్శనమిస్తుంది. ఈ దేవతను పూజిస్తే మానసిక రోగాలు నయం అవుతాయని భక్తుల నమ్మకం. తల్లి దర్శనంతో ప్రశాంతత, ఆనందం కలుగుతాయని వచ్చే భక్తులు తమ అనుభవాలు చెబుతుంటారు. ఈ దేవాలయాన్ని విశ్వకర్మ స్తపతిల నమూనాలో నిర్మించారు. ఇక్కడి శిల్పశైలి కూడా అద్భుతంగా ఉంటుంది. ఉత్సవాల సమయంలో ఈ గుడికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. అంత మందికి మౌలిక సదుపాయాలు కల్పించడం దేవస్థానానికి తలకు మించిన భారం. ఆ భారాన్ని తనే తొలగించాలనుకున్నాడు గానశ్రవణ్.

చొట్టనిక్కర భగవతి అమ్మవారికి కృతజ్ఞతగా.. గర్భగుడిని బంగారుమయం చేస్తానంటున్నారు గానశ్రవణ్. స్వర్ణతాపడం మాత్రమే కాదు.. 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించి, వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందిస్తానంటున్నాడు. దీనితో పాటు ఏడు గెస్ట్‌హౌస్‌లు, ఒక వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, 5వేల మంది పట్టేలా ఆడిటోరియం, సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, వాటర్ సప్లై, గుడి మార్గంలో రోడ్ల వెడల్పు, రెండు రింగు రోడ్లు, లాటరైట్ రాళ్లతో తూర్పుపడమర దిక్కుల్లో పెద్ద గోపురాలు, అన్నదాన సత్రం, పుష్కరిణి కూడా నిర్మించనున్నారు.

రూ.700 కోట్లలో గుడి కోసం 300 కోట్లు, మిగతా 400 కోట్లు హాస్పిటల్ సహా గుడికి కావాల్సిన మౌలిక వసతుల కోసం ఖర్చు చేయనున్నారు. గానశ్రవణ్ లక్ష్యం ఒక్కటే. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతికి సమానంగా చొట్టనిక్కర దేవాలయాన్ని అభివృద్ధి చేయడమే ఈయన టార్గెట్. వచ్చే జనవరిలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయని, ఆరేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కొచ్చిన్ దేవస్వం బోర్డు నేతృత్వంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి.



Tags

Read MoreRead Less
Next Story