ప్రపంచ వారసత్వ జాబితాలో ధోలివిరాకు స్థానం

Dholavira: భారత్‌కు చెందిన మరో పర్యాటక ప్రాంతం, ప్రాచీన పట్టణానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని ధోలవిరాను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ప్రపంచ వారసత్వ జాబితాలో ధోలవిరాను చేర్చినట్లు యునెస్కో ట్విటర్ వేదికగా వెల్లడించింది.
ధోలవిరా.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో వున్న చిన్న గ్రామం.. పురావస్తు ప్రాంతాల్లో చెప్పుకోదగిన ముఖ్యమైన ప్రాంతమిది. హరప్పా నాగరికత విలసిల్లిన పట్టణంగా ధోలవిరా ప్రసిద్ధి చెందింది. క్రీస్తుపూర్వం 1800లో ఈ పట్టణాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి. 5 వేల సంవత్సరాలకు పూర్వం ఇక్కడ ఆధునిక వసతులతో కూడిన నగర జీవనం ఉండేది. సింధులోయ నాగరికతలో వున్న మెట్రోపాలిటన్ నగరంగా ధోలవిరా విరాజిల్లింది.. హరప్పా నాగరికతలోని ఎనిమిది ప్రముఖ ప్రాంతాల్లో ఇది ఐదో అతిపెద్దది కావడం విశేషం.
1967-68లో జేపీ జోషీ నేతృత్వంలోని పురావస్తు శాఖ బృందం ఈ ప్రాంతాన్ని గుర్తించింది. ధోలవిరా.. దాదాపు 3450 ఏళ్ల కిందట సునామీ కారణంగా నేలమట్టమైనట్లు పురావస్తు శాఖ బృందం నిర్ధారించింది. హరప్పన్లకు నౌకాయాన కేంద్రంగా సేవలు అందించింది. ఈ నగరంలో 14 నుంచి 18 మీటర్ల వెడల్పు ఉన్న గోడల నిర్మాణాలు బయటపడ్డాయి.. ఈ నగరం మూడు భాగాలుగా ఉండగా.. కోట, మధ్య నగరం, దిగువ నగరంగా విడదీసి కట్టడాలు నిర్మించిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి.
ధోలవిరా ప్రదేశం ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది.. ఒకప్పుడు ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తోంది.. ఈ పురాతన నగరం నిర్మాణ ఒక అద్భుతమని పురావస్తు శాస్త్రజ్ఞులు చెబుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com