అయోధ్య రామాలయానికి రూ.11 కోట్ల విరాళం!

అయోధ్య రామాలయానికి రూ.11 కోట్ల విరాళం!
అటు ఆలయ నిర్మాణానికి గుజరాత్‌కు చెందిన పలువురు వ్యాపారులు కూడా విరాళాలు అందజేశారు.

ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ మొత్తంలో విరాళాలు అందుతున్నాయి. ఇప్పటికే భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూ. 5,00,100 తొలి విరాళం ఇవ్వగా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా విరాళాలు అందిస్తున్నారు. అందులో భాగంగానే గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్‌భాయ్ ధోలాకియా ఏకంగా రూ.11 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు బ్యాంకు చెక్‌ను అయన శుక్రవారం విశ్వ హిందూ పరిషత్‌ కి అందజేశారు.

కాగా, గోవింద్‌భాయ్‌ ధోలాకియాకు గత కొంతకాలంగా ఆర్‌ఎస్‌ఎస్‌తో మంచి అనుబంధం ఉంది. అటు ఆలయ నిర్మాణానికి గుజరాత్‌కు చెందిన పలువురు వ్యాపారులు కూడా విరాళాలు అందజేశారు. సూరత్‌కు చెందిన మహేష్ కబూతర్‌వాలా రూ.5 కోట్లు, లవ్‌జీ బాద్‌షా రామ్ రూ.1 కోటి విరాళంగా ఇవ్వగా, కొందరు రూ.5 నుంచి రూ.21 లక్షల వరకు విరాళాలు అందజేశారు.

జనవరి 15 నుంచి మొదలైన విరాళాల సేకరణ ఫిబ్రవరి 27న ముగియనుంది. రూ. 20వేలు అంతకంటే ఎక్కువ మొత్తం ఇచ్చే విరాళాన్ని చెక్కుల రూపంతో తీసుకోనున్నట్లు రామ జన్మభూమి ట్రస్ట్‌ పేర్కొంది. అంతేగాక, రూ. 2వేల కంటే ఎక్కువ ఇచ్చిన వారికి రశీదు ఇవ్వాలని నిర్ణయించింది. అటు అయోధ్యలో ఆలయ నిర్మాణానికి మొత్తం రూ .1,100 కోట్లు ఉంటుందని ట్రస్ట్ అంచనా వేసింది.

Tags

Next Story