రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించిన 'దివీస్'‌‌.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత పొందిన తొలి సంస్థగా రికార్డు

రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించిన దివీస్‌‌.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత పొందిన తొలి సంస్థగా రికార్డు
దివీస్ షేర్ ధర ఒక్కసారిగా పెరిగి గురువారం రూ.3800 కంటే మించి ఉంది.

ఫార్మా కంపెనీ దివీస్ లేబొరేటరీస్ రూ.లక్ష కోట్ల మార్కెట్ విలువను అధిగమించి రికార్డులు సృష్టించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దివీస్ షేర్ ధర ఒక్కసారిగా పెరిగి గురువారం రూ.3800 కంటే మించి ఉంది. తద్వారా కంపెనీ వాటాదార్లకు అనూహ్య సంపద సృష్టించినట్లైంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇటువంటి అరుదైన ఘనత సాధించిన కంపెనీ ఇదే కావడం గమనార్హం.

ఇక దేశంలో రూ.1 లక్ష కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ సాధించిన రెండో ఫార్మా కంపెనీ కూడా దివీస్ కావడం గమనార్హం. మొదటి స్థానంలో సన్ ఫార్మాస్యూటికల్స్ ఉంది. దివీస్ భవిష్యత్ ఆశాజనకంగా ఉండడంతో మదుపరులు ఈ కంపెనీ షేరుకు అధిక ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. కంపెనీ తయారు చేసే ఔషధాలను అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో యూనిట్ సామర్థ్యాన్ని విస్తరించేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. రూ.1500 కోట్లతో కాకినాడలో మరో యూనిట్ నిర్మిస్తోంది.

దివీస్ లేబొరేటరీస్‌ను సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మురళి కే.దివి 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా ఎదిగిన సంప్థ మూడు దశాబ్ధాలు పూర్తి చేసుకున్న తరుణంలో లక్ష కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ సాధించడం ఆసక్తికలిగించే అంశం అని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tags

Next Story