హార్పిక్ తాగిన మహిళ.. కడుపు భాగాన్ని తొలగించి ప్రాణాలు కాపాడిన వైద్యులు

హార్పిక్ తాగిన మహిళ.. కడుపు భాగాన్ని తొలగించి ప్రాణాలు కాపాడిన వైద్యులు
బాధితురాలికి బయట నుంచి పైపుల ద్వారా ఆహారం అందించారు. అది నేరుగా కడుపు దిగువ భాగంలోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు.

ఏవో కుటుంబ కలహాలు.. ఆవేశంలో ఆత్యహత్యకు ప్రయత్నించింది.. బాత్‌రూమ్‌లో కనిపించిన హార్పిక్‌ని గడగడా తాగేసింది.. అంతే దాదాపు సంవత్సరం పాటు ట్రీట్‌మెంట్.. అరుదైన శస్త్ర చికిత్స చేసి ఆమె ప్రాణాలు కాపాడారు హైదరాబాద్‌లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు.

ఖమ్మం ప్రాంతానికి చెందిన మంజుల (39) అనే మహిళ 2019 నవంబరులో కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇంట్లో ఉన్న టాయ్‌లెట్ క్లీనర్ హార్పిక్ తాగింది. కుటుంబసభ్యులు గుర్తించి వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆమెను హైదరాబాద్‌లోలని అవేర్ గ్లోబల్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు.

హార్పిక్ తాగడంతో ఆమె అంతర్గత అవయవాలు బాగా దెబ్బతిన్నాయి. ఆస్పత్రి వైద్య బృందం ఆమెకు ఆరు నెలలకు పైగా చికిత్స చేశారు. ఆ తరువాతే శస్త్రచికిత్స చేయడానికి ఆమె బాడీ సహకరించింది. బాధితురాలికి బయట నుంచి పైపుల ద్వారా ఆహారం అందించారు. అది నేరుగా కడుపు దిగువ భాగంలోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. అనంతరం సర్జరీ చేసి కడుపు భాగం తొలగించారు.

కన్సల్టెంట్ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ భూపతి రాజేంద్ర ప్రసాద్ ఈ శస్త్ర చికిత్స నిర్వహించారు. మంజుల శరీరంలోని కడుపు భాగం నాలుగో దశ వరకు పాడైపోవడంతో ఆమె ప్రాణాలు కాపాడేందుకు దాన్ని పూర్తిగా తొలగించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. దాదాపు ఏడాది తర్వాత ఆమె పూర్తిగా కోలుకుని, నోటి ద్వారా తిరిగి ఆహారం తీసుకోవడం ప్రారంభించారని డాక్టర్ భూపతి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

Tags

Next Story