Doctor on Wheels: డాక్టర్ జీవితాన్ని మార్చిన సంఘటన.. కార్పొరేట్ హాస్పిటల్‌లో ఉద్యోగాన్ని వదిలి..!

Doctor on Wheels: డాక్టర్ జీవితాన్ని మార్చిన సంఘటన.. కార్పొరేట్ హాస్పిటల్‌లో ఉద్యోగాన్ని వదిలి..!
Doctor on Wheels: ఆ ఒక్క సంఘటన డాక్టర్ సునీల్ జీవితాన్నే మార్చేసింది. తన భవిష్యత్ ప్రణాళికలన్నీ మార్చుకునేలా చేసింది.

వైద్యులు తమ వృత్తిని ఉద్యోగంగా భావిస్తే దానికి వంద శాతం న్యాయం చేయలేరు. తాము చదువుకున్న చదువుకి సార్ధకత ఉండాలని ప్రతి ఒక్క డాక్టర్ భావిస్తుంటారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ సునీల్ కుమార్ ఓ రోజు హోసూర్-చెన్నై హైవే మీదుగా ప్రయాణిస్తున్నారు. అతడి కళ్ల ముందే జరిగిన యాక్సిడెంట్లో ఓ వ్యక్తి అత్యంత ప్రమాదంలో చిక్కుకున్నారు. వెంటనే డాక్టర్ సునీల్ మరో ఆలోచనలేకుండా అతడికి ప్రధమ చికిత్స అందించి సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వెళ్లి సకాలంలో వైద్యం అందేలా చూశారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడికి చికిత్స చేసి ప్రాణం పోశారు. ఒక రోజు గడిస్తే కానీ చెప్పలేం అన్న వైద్యులు సకాలంలో చికిత్స అందడంతోనే అతడు కోలుకున్నాడని అతడి తల్లికి చెప్పారు. దాంతో బాధితుడి తల్లి డాక్టర్ సునీల్‌కి కాల్ చేసి కృతజ్ఞతలు తెలిపింది. డాక్టర్‌ని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించింది.

ఆ ఒక్క సంఘటన డాక్టర్ సునీల్ జీవితాన్నే మార్చేసింది. తన భవిష్యత్ ప్రణాళికలన్నీ మార్చుకునేలా చేసింది. చివరికి 2011లో అతను BGS గ్లోబల్ హాస్పిటల్స్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి మాతృ సిరి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.

"బీజాపూర్ మెడికల్ కాలేజీ నుండి డాక్టర్‌గా అర్హత సాధించడం, మంచి ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉద్యోగం సంపాదించడం నాకే కాదు నా కుటుంబం మొత్తం కన్న కల అది. నన్ను చదివించడానికి తల్లిదండ్రులు పడిన కష్టం గురించి చెబుతూ, నా వైద్య డిగ్రీ పూర్తి చేయడానికి నాన్న అప్పు చేయవలసి వచ్చింది. సహజంగానే నాకు కార్పొరేట్ హాస్పిటల్‌లో మంచి జీతంతో ఉద్యోగం వచ్చినప్పుడు, మా కష్టాలన్నీ ముగిసాయని అనుకున్నాం. కానీ నేను డాక్టర్ చదివింది లగ్జరీ లైఫ్ అనుభవించడానికి కాదు.. ఆ విషయాన్ని నాకు గుర్తు చేసింది ఆ రోజు జరిగిన సంఘటన అని చెబుతారు సునీల్.

వీలైనంత ఎక్కువ మంది రోగులకు చికిత్స అందించే ఉద్దేశ్యంతో తన కారును మొబైల్ క్లినిక్‌గా మార్చారు. దాదాపు పది సంత్సరాలకు పైగా తాను మొబైల్ క్లినిక్‌ని నడుపుతున్నప్పటికీ, COVID-19 నిజమైన గేమ్ ఛేంజర్ అని చెబుతారు. కారులో ఎప్పుడూ అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, గ్లూకోమీటర్, ఆక్సిజన్ ట్యాంక్, బీపీ మానిటర్, ECG మెషీన్‌ ఉంటాయి. సోషల్ మీడియాలోని అన్ని ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా రోగులకు అందుబాటులో ఉంటాను. దానిని బట్టి ఎవరికి ముందుగా చికిత్స అందించాలి అనేది నిర్ణయించుకుంటానని అంటారు సునీల్.

"మా గ్రామంలోని ప్రజలు, నా తల్లిదండ్రులతో సహా, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం చాలా కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది అని తన చిన్న నాటి సంఘటనలు గుర్తు చేసుకుంటారు. తాను మెడిసిన్ చదవడానికి అది కూడా ఓ కారణమని అంటారు.

2021లో, డాక్టర్ సునీల్ సోదరుడు కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో మొబైల్ క్లినిక్‌ని ఆపమని కుటుంబం నుండి చాలా ఒత్తిడి వచ్చింది. కానీ, "నాకు వచ్చే ఫోన్ కాల్స్ స్విచ్ ఆఫ్ చేసి నన్ను ఇంట్లో కూర్చోడానికి అనుమతించలేదు అని అంటారు సునీల్.

ఇప్పటివరకు, 800 పైగా వైద్య శిబిరాలు నిర్వహించి 1,20,000 మంది ఔట్ పేషెంట్లకు చికిత్స అందించారు. ఆయన చేసిన విశిష్టమైన సేవలకుగాను 2018లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుండి అందుకున్న అవార్డుతో సహా అనేక అవార్డులు ఉన్నాయి. ఎన్ని అవార్డులు వచ్చినా రాని తృప్తి తన సహాయం కోరి వచ్చిన రోగులకు చికిత్స అందించడంలోనే ఉందంటారు డాక్టర్ సునీల్.

Tags

Read MoreRead Less
Next Story