Dolo 650 : ఊహించని విధంగా డోలో-650 అమ్మకాలు

Dolo 650 : డోలో.. ఇది బ్రాండు పేరు మాత్రమే.. మందు పారాసెట్మాల్. 650 ఎంజీ అనేది డోసును తెలియజేస్తుంది. బెంగుళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ ఫార్మా కంపెనీ.. దీన్ని తయారు చేస్తోంది. వాస్తవానికి ఎన్నో ఏళ్లుగా మనందరికీ తెలిసిన పారాసెట్మాల్ బ్రాండ్లు వేరే ఉన్నాయి. అవి జీఎస్‌కే కంపెనీకి చెందిన కాల్‌పాల్, క్రోసిన్ బ్రాండ్లు. ఆ తర్వాత దేశీయ కంపెనీలు అపెక్స్, సిప్లా, ఇప్కా, టోరెంట్‌లు.. పీ-650, పాసిమోల్, పారాసిప్, ఎక్స్‌టీపారా, సుమో-ఎల్ పేర్లతో దీన్ని అందిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలందరికీ గుర్తుకు వచ్చేది 'డోలో 650'నే. జ్వరం అనగానే పారాసెట్మాల్ వేసుకో అనడానికి బదులు.. 'డోలో 650' వేసుకో అంటున్నారు. అంతలా జనంలోకి వెళ్లిపోయింది ఈ బ్రాండ్.
కరోనాకు ముందు అన్ని పారాసెట్మాల్ టాబ్లెట్స్‌తో పాటు ఇది ఒక టాబ్లెట్‌గా ఉండేది. కానీ కరోనా వచ్చాక సీన్ మారిపోయింది. కరోనాలో మొదట కనిపించే లక్షణ జ్వరం. డాక్టర్లు మొదట సిఫార్స్ చేసే మెడిసిన్ డోలో-650. దీంతో పాటు యాంటీ బయోటిక్స్, విటమిన్ ట్యాబ్లెట్స్ సూచిస్తున్నా.. మొదటి మెడిసిన్ మాత్రం డోలోనే. ఇప్పుడీ ఈ ఆధరణ, ప్రజలు చూపిస్తున్న నమ్మకాన్ని.. దాన్నితయారు చేస్తున్న కంపెనీ వాళ్లు కూడా నమ్మలేకపోతున్నారు. మేం కూడా ఇంత రెస్పాన్స్ ఊహించలేదని మైక్రో ల్యాబ్స్ స్వయంగా చెప్పింది.
పారాసెట్మాల్‌లో 500ఎంజీ డోసు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ నేపథ్యంలోనే 1993లో డోలో పేరుతో 650ఎంజీ ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చింది మైక్రో ల్యాబ్స్. దీని సక్సెస్‌కు ఈ డోసేజ్ సైజే ప్రధాన కారణం. పారాసెట్మాల్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడే.. జ్వరానికి 500 ఎంజీ డోసు సరిపోవడం లేదు.. కొంత ఎక్కుడ డోసు ఉంటే బాగుంటుంది అని వైద్యులు అభిప్రాయపడ్డారు. దీన్ని మొదట అందుకుని సక్సెస్ అయ్యింది మైక్రో ల్యాబ్స్. దీన్ని ఉత్పత్తి చేయడం అంత తేలిక కానప్పటికీ.. సొంతంగా రీసెర్చ్ చేసి దీన్ని సాధించింది.
కోవిడ్ తర్వాత డోలో-650 అమ్మకాలు ఊహించని విధంగా సాగాయి. వేలు కాదు, లక్షలు కాదు.. ఏకంగా 350కోట్లకు పైగా ట్యాబ్లెట్లు అమ్ముడయ్యాయి. ఇక్వియా గణాంకాల ప్రకారం.. 2021లో ఒక్క డోలో ద్వారానే మైక్రో ల్యాబ్స్‌కు 307కోట్ల రూపాయలు వచ్చాయి. 2021 డిసెంబర్ ఒక్క నెలలోనే 29కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. డోలో-650 తర్వాత రెండో స్థానంలో ఉన్న కాల్‌పాల్ 28కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.
ఎక్కువ మంది వైద్యులు సిఫార్స్ చేస్తుండబట్టే.. మిగిలిన బ్రాండ్లకు దీనికి ఇంత తేడా ఉంటోందని.. ఫార్మా వర్గాలు చెబుతున్నాయి. ఇది పారాసెట్మాల్‌గా కాకుండా డోలో-650 అనేది స్పెషల్ మెడిసిన్‌లా మారిపోయిందని అంటున్నారు. డోలో ఇచ్చిన బూస్ట్‌తో మైక్రో ల్యాబ్స్ 2,700కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేస్తోంది. మార్కెట్ పెరగడంతో.. త్వరలోనే పబ్లిక్ ఇష్యూకి వచ్చే ఆలోచన చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com