కోవిడ్ రెండోసారి వస్తుందా: సీసీఎంబీ డైరెక్టర్ వివరణ

కోవిడ్ రెండోసారి వస్తుందా: సీసీఎంబీ డైరెక్టర్ వివరణ
మహమ్మారి కరోనా ఒకసారి వచ్చిపోతే మళ్లీ రాదులే అన్న ఆలోచనతో ఉంటాం..

ఒకసారి వస్తేనే వైరస్ తో పోరాడిన శరీరం.. మళ్లీ రెండోసారి ఎందుకు అటాక్ చేస్తుంది అన్న అనుమానమూ తలెత్తుంది కొందరిలో.. కానీ వైరస్ పోరాడే యాంటీబాడిస్ కొంతకాలమే శరీరంలో ఉంటున్నాయి.. అందువల్ల రాదు అని చెప్పడానికి అవకాశం లేదు అని తాజా అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ఈ గందరగోళ పరిస్థితి ఇలా ఉంటే దీనిపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా మాట్లాడుతూ కరోనా రెండోసారి వస్తుందనే భయాలు పెట్టుకోవద్దంటున్నారు. అక్కడక్కడ ఒకరిద్దరూ రెండోసారి కొవిడ్ బారిన పడ్డారనే వార్తలు వచ్చినా దానికి పలు రకాల కారణాలు ఉండొచ్చు. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది. నమూనాలు మారిపోవచ్చు.. ఒక్కోసారి పరీక్షా ఫలితాల్లోనూ తేడా రావచ్చు.

కరోనా సోకిన వ్యక్తుల్లో మొదటిసారి యాంటీబాడీస్ ఉత్పత్తి తగినంత లేకపోవడం, రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు ఇలా అనేక కారణాలు ఉంటాయి. నిజానికి మన శరీర వ్యవస్త గతంలో సోకిన అంటువ్యాధులను గుర్తుంచుకోగలదు. వైరస్ శరీరంపై దాడి చేసినప్పుడు సహజ రోగనిరోధక సైన్యాన్ని వైరస్ పైకి పంపుతుంది. తర్వాత బిలిఫోసైట్ దళాలు వైరస్ చెంతకు చేరుకుని ప్లాస్మాకణాలను తయారు చేయడం ప్రారంభిస్తాయి. అవి యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియకు ఒకటి నుంచి రెండు వారాలు పడుతుంది. మళ్లీ వైరస్ సోకితే మాత్రం శరీరం వెంటనే స్పందించి దాడి చేస్తుంది. శరీరంలో యాంటీబాడీస్ లేకపోయినా లింఫోసైట్లు ఏళ్ల తరబడి ఉంటాయి. ఇలాంటి చాలా రక్షణ వ్యవస్థలు మన శరీరాన్ని అంటువ్యాధుల బారి నుంచి కాపాడుతాయి. అయితే కోవిడ్ కు సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది అని మిశ్రా తెలిపారు.

Tags

Next Story