ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్ ఉపఎన్నిక..!

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా 3 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ షెడ్యూల్ రిలీజైంది. సీఎం మమత బెనర్జీ భవానీపూర్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగుతుండటంతో… మరోసారి దేశమంతటా బెంగాల్ రాజకీయం చర్చనీయాంశమవుతోంది. నాలుగు నెలల క్రితం జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘనవిజయం సాధించినా, నందిగ్రామ్‌లో మమత ఓడిపోయారు. ఐనప్పటికీ… ఆమె ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. సీఎం పగ్గాలు చేపట్టిన మమత బెనర్జీ ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది.
బెంగాల్ లోని భవానీపూర్ సెగ్మెంట్ నుంచి ఈసారి బరిలో దిగుతున్నారు మమత బెనర్జీ. ఇది ఆమెకు కంచుకోట లాంటి స్థానం. గతంలో రెండుసార్లు ఇక్కడినుంచే పోటీ చేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో భవానీపూర్ నుంచి టీఎంసీ నాయకుడు సోభాందేవ్ ఛటోపాధ్యాయ పోటీ చేసి గెలిచారు. ఆయన రాజీనామా చేయడంతో… ఇక్కడినుంచి మమత బెనర్జీ బరిలోకి దిగుతున్నారు. బెంగాల్ లో భవానీపూర్, శంషేర్ గంజ్, జంగీపూర్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు స్థానాలతో పాటు… ఒడిశాలో పిప్లి అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 3న ఫలితాలు రానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com