సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం

దేశంలో 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. దీంతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌నూ విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణలో నాగార్జున సాగర్, ఆంధ్ర ప్రదేశ్‌లో తిరుపతి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఉత్కంఠ కల్గిస్తున్నాయి. బెంగాల్ అసెంబ్లీలో 294 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు జయకేతనం ఎగురవేసింది తృణమూల్ కాంగ్రెస్. ఈసారి కూడా విజయం సాధించి హాట్రిక్ కొట్టేయ్యాలని మమత దీదీ భావిస్తున్నారు. అయితే ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి సువేందు అధికారి సహా కీలక నేతలు పార్టీని వీడటం తృణమూల్‌లో ఆందోళన నింపింది. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీగా పుంజుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపును సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.
అటు.. 140 స్థానాలున్న కేరళ 14వ శాసనసభ గడువు జూన్ 1వ తేదీన ముగియనుంది. గత ఎన్నికల్లో వామపక్షాల నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే ఈ సారి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ.. ఈ సారి ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహాలను అమలుచేస్తోంది. ఇటీవలే మెట్రో మ్యాన్ శ్రీధర్ ఆ పార్టీలో చేరారు.
మరోవైపు.. తమిళనాడులో 15వ శాసనసభ గడువు మే 24తో ముగియనుంది. 234 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం అన్నాడీఎంకే అధికారంలో ఉంది. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత జైలుకెళ్లిన ఆమె నెచ్చెలి శశికళ ఇటీవలే విడదలయ్యారు. దీంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అటు స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే కూడా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఈశాన్య రాష్ట్రం అసోంలోనూ త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ప్రస్తుత శానసనభ గడువు ఏప్రిల్‌లో ముగియనుంది. తరుణ్ గొగొయ్ నేతృత్వంలో సుదీర్ఘంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న అసోంలో గత ఎన్నికల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. తొలిసారిగా ఆ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లోనూ అదే ఉత్సాహంతో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు కీలక నేత అయిన తరుణ్ గొగొయ్ ఈ ఏడాది మరణించడం ఆ పార్టీకి లోటుగా ఉంది.
ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి కూడా త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పుదుచ్చేరి శాసనసభ గడువు మే వరకు ఉంది. అయితే ఇటీవల అక్కడ నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కుప్పకూలింది. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో శాసనసభలో కాంగ్రెస్ బలం తగ్గింది. దీంతో బలనిరూపణలో విఫలమైన నారాయణస్వామి సీఎం పదవికి రాజీనామా చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com