Graduate Chaiwali: ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్.. ఉమెన్స్ కాలేజీ బయట టీ అమ్ముతూ..

Graduate Chaiwali: ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్.. ఉమెన్స్ కాలేజీ బయట టీ అమ్ముతూ..
X
Graduate Chaiwali: ఇంత చదివించినా ఇంకా అమ్మానాన్న మీద ఆధారపడడం అవమానంగా భావించింది.. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంది.. ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ఛాయ్ దుకాణం తెరిచింది.

Graduate Chaiwali: తనకు మంచి ఉద్యోగం దొరక్కపోవడంతో టీ దుకాణం ప్రారంభించి మంచి వ్యాపారవేత్త కావాలని నిర్ణయించుకుంది ప్రియాంక. ఒక పక్క పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే కస్టమర్ల కోసం రుచికరమైన టీని తయారు చేసి అందిస్తోంది.

24 ఏళ్ల ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ పాట్నా ఉమెన్స్ కాలేజీ వెలుపల చాయ్‌వాలి పేరుతో టీ దుకాణాన్ని తెరవడంతో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఆమె తనకు మంచి ఉద్యోగం దొరక్కపోవడంతో టీ దుకాణం ప్రారంభించి వ్యాపారవేత్త కావాలని నిర్ణయించుకుంది.

బీహార్‌లోని పూర్నియాకు చెందిన ప్రియాంక మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్, వారణాసి నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి పాట్నా ఉమెన్స్ కాలేజీ బయట టీ అమ్మడం ప్రారంభించింది. ఆమె పాన్ టీ, చాక్లెట్ టీతో సహా 4 రకాల టీలను అందిస్తోంది.

"గత రెండు సంవత్సరాలుగా, నేను బ్యాంక్ పోటీ పరీక్షలకు నిరంతరం ప్రయత్నిస్తున్నాను, కానీ క్వాలిఫై కాలేదు. దాంతో ఇంటికి తిరిగి వెళ్లాలనుకోలేదు. పాట్నాలోనే ఉండి ఏదో ఒకటి చేయాలనుకున్నాను. నా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నా స్వంత కాళ్ల మీద నిలబడాలనుకున్నాను.. టీ స్టాల్‌ను ఏర్పాటు చేయడానికి నేను ఏమాత్రం వెనుకాడ లేదు. ఈ వ్యాపారాన్ని ఆత్మనిర్భర్ భారత్‌కు ఒక ముందడుగుగా నేను భావిస్తున్నాను, "అని ప్రియాంక జాతీయ మీడియాకు తెలిపింది.

సోషల్ మీడియాలో ఆమె టీస్టాల్ ఫోటోలు వైరల్‌గా మారాయి. నెటిజన్స్ నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు ఆమె స్ఫూర్తిని ప్రశంసించారు. మరికొందరు దేశంలో ఉద్యోగాలు లేకపోవడం గురించి విచారం వ్యక్తం చేశారు.

మరొక నెటిజన్ ఇలా రాసుకొచ్చారు.. ప్రియాంక ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది.. చదువుకున్న వారందరికి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం లేదు.. ఉద్యోగం కోసం వేచి చూడకుండా మరో ఉపాధిని ఎంచుకుంది.. హ్యాట్సాఫ్ ప్రియాంక అని చెప్పారు. ఆమెకు శుభాకాంక్షలు అందించారు.

ఇక్కడ ఆసక్తికరమైన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. ప్రియాంక స్ఫూర్తి పొందింది అహ్మదాబాద్‌లో టీ దుకాణం నడుపుతున్న ప్రఫుల్ బిల్లోర్ ని చూసి. అతడు MBA పూర్తి చేశాడు. అయినప్పటికీ, సొంతంగా ఒక టీ దుకాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు అతడి ఛాయ్ బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతోంది. రేపొద్దున్న ప్రియాంక కూడా మంచి వ్యాపారవేత్త కావాలని కోరుకుంటున్నారు నెటిజన్లు.

Tags

Next Story