నిర్ణయం మార్చుకున్న మాజీ మంత్రి.. నడ్డాతో భేటి అనంతరం..!

రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఇటీవల ప్రకటించిన బీజేపీ నేత, మాజీ మంత్రి బాబుల్ సుప్రియో తన నిర్ణయం మార్చుకున్నారు. ఎంపీ పదవిలో కొనసాగుతానని సోమవారం ఆయన స్పష్టంచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జరిగిన సమావేశం అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండబోనని, రాజ్యాంగపరమైన బాధ్యతను మాత్రం నిర్వర్తిస్తానని తెలిపారు. ఇక తాను ఏ పార్టీలోనూ చేరనని, ఢిల్లీలో ఎంపీ బంగ్లాను ఖాళీ చేస్తానని, భద్రతా సిబ్బందిని కూడా వెనక్కి ఇచ్చేయనున్నట్లు ఆయన తెలిపారు.
కాగా ఇటీవల మోదీ క్యాబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన 12 మంది కేంద్ర మంత్రులలో ఈయన ఒకరు. ప్రముఖ గాయకుడైన బాబుల్ సుప్రియో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆ ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. మోదీ హయంలో తొలిసారి ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రెండోసారి కూడా ఆయన అదే లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచి రెండోసారి కూడా ఆయన కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com