Konijeti Rosaiah: మహానేత 'రోశయ్య' రాజకీయ ప్రస్థానం.. ఆర్ధిక మంత్రిగా 15 సార్లు..

Konijeti Rosaiah: మహానేత రోశయ్య రాజకీయ ప్రస్థానం.. ఆర్ధిక మంత్రిగా 15 సార్లు..
Konijeti Rosaiah: మరో మహానేత కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు.

Konijeti Rosaiah: మరో మహానేత కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. వైద్య చికిత్స కోసం రోశయ్యను హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన అకాల మరణం చెందారు. ఆయన మరణ వార్త విన్న కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

రోశయ్య ప్రస్థానం..

1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యాభ్యాసం అనంతరం ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున 1968,1974,1980లలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లశాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత అనేక మంది ముఖ్యమంత్రుల మంత్రి వర్గాల్లో పలు కీలకమైన శాఖలను నిర్వహించారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, రవాణా, విద్యుత్ శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలు, 1992లో తిరిగి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలకు మంత్రిగా పని చేశారు.

2004,2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 సార్లు ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పని చేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004-09కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రోశయ్య..2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.

బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 14 నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు 2011 ఆగస్ట్ 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గనవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్ట్ 30 వరకు తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య తన సేవలందించారు.

సీఎంలు మారినా ఆర్ధిక మంత్రి పోస్టు ఆయనకే..

వివాదరహితుడిగా పేరుపొందిన రోశయ్యకు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల్లోనూ అభిమానులు ఉన్నారు. పార్టీలో ముఖ్యమంత్రులు మారినా ఆర్థిక మంత్రిగా ఆయన్నే నియమించేవారు.

రోశయ్య రాజకీయ ప్రస్థానం..

1968-85: శాసనమండలి సభ్యుడు

1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత

1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి

1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడు

1989-94: రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రి పదవి

2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు

2004: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి

2009: రాష్ట్ర శాసనమండలి సభ్యుడు

2009: సెప్టెంబరు నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఏపీ సీఎం

2011 ఆగస్టు 31: తమిళనాడు గవర్నర్

Tags

Next Story