Himachal Pradesh: ఫ్యాన్సీ నెంబర్ మోజు.. లక్ష రూపాయల స్కూటీకి కోటి పెట్టి..

Himachal Pradesh: లక్కీ నెంబర్.. చాలా మందికి అదో పిచ్చి.. ఫోన్ నెంబర్ అయినా, కార్ నెంబర్ అయినా ఫ్యాన్సీగా ఉండాలనుకుంటారు.అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. వాహనం విలువతో సంబంధం లేకుండా లక్షలు వెచ్చించేందుకు సిద్ధమవుతుంటారు. ఫ్యాన్సీ నెంబర్లను క్యాష్ చేసుకునేందుకు ఆర్టీఏ అధికారులు వాటిని వేలం వేస్తుంటారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో HP 999999 వేలానికి ఉంచింది. దీని కనీస ధర రూ.1000 నిర్ణయించారు.
ఈ నంబర్‌ను పొందేందుకు ఔత్సాహిక వాహనదారుల మధ్య పోటీ మొదలైంది. బిడ్డింగ్‌లో మొత్తం 26 మంది పాల్గొన్నారు. ఒక వ్యక్తి అక్షరాలా కోటి పదకొండు వేల (రూ. 1,00,11,000) రూపాయలకు బిడ్ సమర్పించాడు. ఇంతకీ ఆ వ్యక్తి వద్ద ఉన్నది ఏ బెంజ్ కారో లేదా ఆడి కారు లాంటి ఖరీదైన కారు కూడా కాదు.. అక్షరాలా లక్ష రూపాయలు పెట్టి కొన్న స్కూటీ కోసం.
సిమ్లా కోట్‌ఖాయ్‌కు చెందిన వ్యక్తి ఇటీవల లక్ష రూపాయలతో స్కూటీని కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ ఫ్యాన్సీ నెంబర్ కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాడు. అతని వేలాన్ని చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఈరోజు సాయంత్రం వరకు బిడ్డింగ్‌ను ఆమోదించనున్నారు. ఆ తర్వాత ఎక్కువ మొత్తం కోట్ చేసిన వారికి ఆ నంబర్ కేటాయిస్తారు. చూద్దాం! ఈ ఫ్యాన్సీ నంబర్ ఎవరి సొంతమవుతుందో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com