డిమాండ్లు పరిష్కరించడంలో విఫలమైతే.. ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్న రైతులు

కొత్త సాగు చట్టాల రద్దే లక్ష్యంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. సోమవారం జరగనున్న ఏడో విడత చర్చల్లో కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైతే హర్యానాలోని మాల్స్, పెట్రోల్ బంకులను మూసివేస్తామని హెచ్చరించారు. ఆరు దఫాలుగా జరిగిన చర్చల్లో సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధ హామీపై ప్రభుత్వం ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదని స్వరాజ్ ఇండియా నేత యోగేందర్ విమర్శించారు. ప్రభుత్వంతో చర్చలు ఇలానే సాగుతూ ఉంటే ఆందోళనల తీవ్రతను పెంచుతామని హెచ్చరించారు.
డిసెంబర్ 30న రైతులకు కేంద్రానికి మధ్య జరిగిన చర్చల్లో.. సగం అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విషయాలన్నీ అసత్యాలని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఆరవ విడత చర్చల్లో కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాలకు ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదని, ముందు జరిగిన ఐదు సమావేశాల్లాగే ఇదీ ముగిసిందని రైతు సంఘాల నేతలు చెప్పారు. తమ ప్రధాన డిమాండ్లు రెండే ఉన్నాయని రైతులు స్పష్టం చేశారు. తాజాగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం, కనీస మద్దతు ధరపై చట్టబద్ధ హామీ ఇవ్వడం.. ఈ రెండే తమ డిమాండ్లని స్పష్టంగా చెప్పారు.
సోమవారం నాటి చర్చల్లో తమ డిమాండ్లకు కేంద్రం ఒప్పుకోకపోతే జనవరి 6న ర్యాలీ చేపడతామని ప్రకటించారు. కుంద్లి-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో ట్రాక్టర్ల ర్యాలీ చేపడతామన్నారు రైతులు. దేశవ్యాప్త నిరసనలకూ పిలుపునిస్తామని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల్ని కూడా రైతులు తమదైన పద్దతిలో చేసుకున్నారు. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో తెల్లవారు జామున చలి మంటలు వేసుకుంటూ, జానపద పాటలు పాడుకున్నారు. గాజీపుర్ సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొన్న మొహర్ సింగ్ అనే రైతు చనిపోయారు. మొహర్ గుండె పోటుతో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com