సాగు చట్టాలపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్న కేంద్రం!

సాగు చట్టాలపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్న కేంద్రం!
రైతుల తీరుపై కేంద్రమంత్రులు సమావేశంలో అసంతృప్తి వ్యక్తంచేశారు.

వ్యవసాయ చట్టాలపై రైతులతో కేంద్రం దశల వారీగా జరుపుతున్న చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ శుక్రవారం జరిపిన 11వ విడత చర్చల్లోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. తదుపరి చర్చలకు సంబంధించి తేదీ ఖరారు చేయకుండానే సమావేశం ముగించారు. రైతుల తీరుపై కేంద్రమంత్రులు సమావేశంలో అసంతృప్తి వ్యక్తంచేశారు.

చట్టాల్లో లోపం లేకపోయినా వాయిదా ప్రతిపాదన చేశామని తోమర్‌ అన్నారు. ఏడాదిన్నర పాటు చట్టాల నిలుపుదలకు మించిన ప్రతిపాదనను ఏదీ తమవద్ద లేదని తేల్చిచెప్పారు. ప్రతిపాదనపై రైతులు నిర్ణయం తీసుకోలేదని అన్నారు. "బంతి మీ కోర్టులోనే ఉంది.. కేంద్రం ప్రతిపాదనలపై మీ నిర్ణయం చెబితే మళ్లీ చర్చించేందుకు సిద్ధం" అని రైతులతో తోమర్‌ పునరుద్ఘాటించారు.

దేశం, రైతుల సంక్షేమం దృష్ట్యిలో పెట్టుకుని చట్టాల అమలు వాయిదా ప్రతిపాదన చేశామని చెప్పారు. చట్టాల రద్దు మినహా మరే ప్రతిపాదనతోనైనా రావాలని రైతు సంఘాల నేతలను కోరారు. తమ ప్రతిపాదన కంటే మెరుగైన ప్రతిపాదనతో వస్తే చర్చించేందుకు సిద్ధమేనని స్పష్టంచేశారు.

మరోవైపు.. కేంద్రమంత్రులతో తొలిరౌండ్‌లో 10 నిమిషాలకు మించి చర్చలు జరగలేదని రైతు సంఘాల నేతలు తెలిపారు. కొన్ని గంటల తర్వాత మళ్లీ వచ్చిన కేంద్రమంత్రులు.. వాయిదాకు మించిన ప్రతిపాదనలు చేయలేమని చెప్పినట్టు తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని తాము డిమాండ్‌ చేసినట్టు చెప్పారు. తదుపరి చర్చలు కొనసాగుతాయని కూడా తాము అనుకోవడంలేదని వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రతిపాదనపై అభిప్రాయం చెబితే... తదుపరి సమావేశానికి తేదీ ఖరారు చేస్తామని మంత్రులు చెప్పినట్టు తెలిపారు.

అటు.. గణతంత్ర దినోత్సవం రోజున తలపెట్టిన కవాతు కోసం పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని రైతు సంఘాల నేతలు చెప్పారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తామని అన్నారు. జనవరి 26 తర్వాత ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే అంశంపై సమావేశమై చర్చిస్తామని చెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story