ఏడో రోజుకు చేరిన రైతుల ఆందోళన

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు ఓ కొలిక్కిరాలేదు. మంగళవారం రైతులతో కేంద్రమంత్రుల సమావేశం అసంతృప్తిగానే ముగిసింది. దీంతో గురువారం మరోసారి రైతులతో భేటీ కావాలని కేంద్రమంత్రులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు కేంద్రమంత్రులు తాజాగా భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా నివాసంలో వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
మరోవైపు రైతుల ఆందోళలనకు వామపక్షాలు పూర్తి మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా దిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి లెఫ్ట్ పార్టీలు. దీంతో పోలీసులు వామపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. అటు రైతుల నిరసలో ఎక్కువమంది రైతుల్లాగే కనిపించడం లేదన్న కేంద్రమంత్రి వీకేసింగ్ వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. రైతులుగా కనిపించాలంటే నాగళ్లు, ఎద్దు బండ్లు తీసుకుని రావాలా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు ఏడో రోజుకు చేరుకున్నాయి. రైతుల ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో మంగళవారం రైతులకు కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశం ఎటూ తేలకుండానే ముగిసింది. సమస్యల పరిష్కారం కోసం కమిటీని నియమిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. దీంతో చర్చలను గురువారానికి వాయిదా వేశారు. అంతేకాకుండా రైతులు తమ అభ్యంతరాలను బుధవారం సాయంత్రంలోగా లిఖితపూర్వకంగా ఇవ్వాలని కేంద్రం సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com