రైతులతో కేంద్రం చర్చలు మరోసారి విఫలం

రైతులతో కేంద్రం చర్చలు మరోసారి విఫలం

ప్రతీకాత్మక చిత్రం 

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరు కొనసాగిస్తున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు మళ్లీ అసంపూర్తినే మిగిల్చాయి. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో రైతులతో దాదాపు ఏడు గంటల పాటు కేంద్రం చర్చలు జరిపినా.. ఓ కొలిక్కి మాత్రం రాలేదు. దీంతో రేపు మరోసారి రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వ చర్చలకు పిలుపునిచ్చింది.

దాదాపు ఏడు గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల్లో భాగంగా 35 రైతు సంఘాల నేతలు తమ అభ్యంతరాలను కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌కు వినిపించారు. అయితే, కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, అందుకు గల కారణాలను వివరిస్తూ రైతు సంఘాలు కేంద్రానికి ఒక నివేదికను కూడా సమర్పించాయి. పార్లమెంట్‌ ప్రత్యేకంగా సమావేశమై కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

రైతు సంఘాల నేతలు పలు అంశాలు లేవనెత్తారని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చెప్పారు. సుహృద్భావ వాతావరణంలోనే రైతులతో చర్చలు సాగాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇగో లేదన్నారు. రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని, తెలిపారు. రైతుల అపోహలపై చర్చించి పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. చర్చలపై తుది నిర్ణయం చెప్పేందుకు ఈ నెల 5 వరకు గడువు కోరారు. అయితే, కనీస మద్దతు ధర అంశాన్ని టచ్‌ చేయబోమని, ఈ చట్టంలో మార్పులు చేసేందుకు సిద్ధంగా లేమన్నారు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌.

ఇదిలా ఉంటే సింఘూ సరిహద్దు వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు రైతు సంఘాల ప్రతినిధులు సమావేశం కానున్నారు. శనివారం కేంద్రం చర్చలకు హాజరవ్వాలా... లేదా... అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. చట్టాల్లో కొన్ని సవరణలు చేసేందుకు కేంద్రం ముందుకొచ్చినా.. రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. సమావేశంలో కేంద్రం ఆఫర్‌ చేసిన భోజనాలను రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు.

మరో వైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమాలు కొనసాగుతున్నాయి. సింఘూ సరిహద్దు వద్ద రైతులు టెంట్‌లు వేసుకుని రాత్రి, పగలు తేడా లేకుండా పోరు కొనసాగిస్తున్నారు. రోడ్లపైనే భోజనాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. కేంద్రం దిగి వచ్చేవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు ఇప్పటికే హెచ్చరించారు. కరోనా కష్టకాలంలో దేశ రాజధానిలో చలిని తట్టుకొని రైతులు గత 8 రోజులుగా తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పట్టుదలతో ఆందోళన కొనసాగిస్తున్నారు. శనివారం కేంద్రం చర్చలకు హాజరావుతారా.. లేక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

Tags

Next Story