రైతుల ఆందోళన.. డిసెంబర్ 14న దేశవ్యాప్తంగా ధర్నాలు

రైతుల ఆందోళన.. డిసెంబర్ 14న దేశవ్యాప్తంగా ధర్నాలు
X

రైతుల ఆందోళనలతో ఢిల్లీ హోరెత్తుతోంది. 16వ రోజూ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. నూతన వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టాలు అమలైతే కార్పొరేట్ సంస్థల దురాశకు తాము బాధితులుగా మారిపోతామని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయోత్పత్తుల ధరల నిర్ణయం కోసం రైతు కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ దాఖలు చేసిన పిటిషన్‌లో ఇంటర్వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేసింది. అటు వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలని నిర్ణయించారు.

రైతులు ఉద్యమ పంథాను వీడాలని, ప్రభుత్వంతో చర్చలు జరపాలని కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విజ్ఞప్తి చేశారు. చర్చల విషయంలో ఏర్పడ్డ ప్రతిష్టంభనను రైతులు తొలగించాలని ఆయన కోరారు. రైతుల ఉద్యమంతో సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు వెంటనే తమ ఉద్యమాన్ని విరమించుకొని, చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.

మూడు వ్యవసాయ చట్టాలపై అటు కేంద్రం, ఇటు రైతులు.. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ఈ వివాదాస్పద చట్టాలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు అధికార బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ భారీ కార్యక్రమం ప్రారంభించే ఛాన్స్ ఉంది. దేశ వ్యాప్తంగా 100 ప్రెస్‌మీట్‌లు, 700 జిల్లాల్లో రైతులతో 700 సమావేశాలను నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్యాంపెయిన్‌లో కేబినెట్‌ మంత్రులు సైతం పాల్గొంటారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు లేవనెత్తుతున్న సమస్యలపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను కూడా వివరించనున్నారు. అంతేకాకుండా, ఈ చట్టాలపై రైతుల్లో నెలకొన్న ఆందోళనలు, వారు లేవనెత్తుతున్న సమస్యలకు కేంద్రం చెబుతున్న పరిష్కారాలను ఈ వేదిక నుంచి వివరించనుంది. ముఖ్యమైన ప్రాంతాల్లో స్థానికంగా మీడియా సమావేశాలతో పాటు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమలదళం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Tags

Next Story