హస్తినలో అలుపెరుగని పోరాటాలు చేస్తున్న అన్నదాతలు

హస్తినలో అలుపెరుగని పోరాటాలు చేస్తున్న అన్నదాతలు

హస్తినలో అన్నదాతలు అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోవడంతో రిలే నిరాహార దీక్షలు చెప్పాట్టారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తేనే చర్చలకు సిద్ధమని తేల్చి చెప్పారు. కేంద్రం రైతు సంఘాలను అప్రతిష్టపాలు చేయాలని చూస్తోందని విమర్శించారు. దీనిపై కేంద్రానికి రైతుల ఐక్యవేదిక పేరుతో లేఖరాసినట్టు పేర్కొన్నారు.

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను ఆరోసారి చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖపై సమావేశమై రైతు నేతలు చర్చించారు. తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, గతంలో సవరణలు చేస్తామంటూ ఇచ్చిన ప్రతిపాదనలను అప్పుడే తిరస్కరించామన్నారు. ఉద్యమంతో సంబంధంలేని సంఘాలతో కేంద్రం మాట్లాడుతోందని.. తద్వారా తమ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

కేంద్రం రాతపూర్వక హామీలతో రావాలని కోరుతున్నట్టు రైతులు చెప్పారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని మరోసారి డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధర విషయంలో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా చట్టం తేవాలని కోరారు. ఇలాంటి లిఖితపూర్వక ప్రతిపాదనలతో చర్చలకు పిలిస్తేనే వస్తామని తేల్చి చెప్పారు.

మరోవైపు మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ డిసెంబరు 25న రైతులను ఉద్దేశించి వర్చువల్‌ విధానంలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర వైఖరిని రైతులకు స్పష్టం చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశం తరువాత నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకున్న అపోహలు తొలగిపోతాయని ఆశిస్తున్నామన్నారు. గతవారం మధ్యప్రదేశ్‌లో జరిగిన సమావేశంలోనే రైతులతో ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Tags

Next Story