రైతు ఆందోళనలు మరింత ఉధృతం.. రిపబ్లిక్‌డే రోజున ట్రాక్టర్‌ ర్యాలీకి సన్నాహాలు

రైతు ఆందోళనలు మరింత ఉధృతం.. రిపబ్లిక్‌డే రోజున ట్రాక్టర్‌ ర్యాలీకి సన్నాహాలు
రిపబ్లిక్‌ డే రోజున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి తీరుతామన్నారు రైతు సంఘాల నేతలు.లక్ష ట్రాక్టర్లతో మార్చ్ నిర్వహిస్తామన్నారు.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని.. ప్రభుత్వం దిగిరాకపోతే వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకైనా ఉద్యమం కొనసాగించేందుకు సిద్ధంగానే ఉన్నామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ పేర్కొంది. చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలిగించే వరకు పోరాడుతామని వెల్లడించింది.

ఇది కేవలం ధనిక రైతుల ఉద్యమంగా వస్తోన్న ఆరోపణలు నిజం కావని, మారుమూల గ్రామాల ప్రజలూ తమ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నట్లు చెప్పింది. తాము 2024 మే వరకు నిరసనలు తెలిపేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు రైతు సంఘాల నేతలు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బదులిచ్చారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే మొండి పట్టుదలను రైతులు విడనాడాలని హితవు పలికారు. అంశాలవారీగా సమస్యల పరిష్కారం కోసం చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయ చట్టాలపై రైతులు-కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ తొలి భేటీ మంగళవారం జరగనున్నట్లు సభ్యుడు అనిల్‌ ఘన్వాత్‌ వెల్లడించారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యచరణ సిద్ధం చేస్తామన్నారు. నిపుణుల కమిటీ తొలి భేటీలో అనిల్‌ ఘన్వాత్‌తో పాటు డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ జోషీ, అశోక్‌ గులాటీలు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. సభ్యుల్లో మరొకరైన భూపీందర్‌ సింగ్‌ మాన్‌ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించగా, ఆయన స్థానంలో కొత్త సభ్యుడి ఎంపికపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఇక.. రిపబ్లిక్‌ డే రోజున ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి తీరుతామన్నారు రైతు సంఘాల నేతలు. ఔటర్ రింగు రోడ్డులో లక్ష ట్రాక్టర్లతో మార్చ్ నిర్వహిస్తామన్నారు. ఐతే తమ వల్ల రిపబ్లిక్‌ డే వేడుకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. రెండు నెలలు నుంచి శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నామని, ట్రాక్టర్ ర్యాలీ కూడా పీస్‌ఫుల్‌గా కొనసాగుతుందన్నారు. మరోవైపు రైతుల ట్రాక్టర్ ర్యాలీని సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌.. విచారణ జరపనుంది. రేపు కేంద్రం, రైతుల మధ్య మరో సారి చ ర్చలు జరగనున్నాయి.. అయితే, ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం తేలకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు.. ట్రాక్టర్‌ మార్చ్‌ కోసం సిద్ధమవుతున్నారు.. మార్చ్‌లో పాల్గొనేందుకు పంజాబ్‌లోని పలు ప్రాంతాల నుంచి రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి బయలుదేరారు.


Tags

Next Story