చట్టాలు రద్దు చేసే వరకు దిల్లీ సరిహద్దుల్ని వీడేదిలేదు : రైతు సంఘాలు

చట్టాలు రద్దు చేసే వరకు దిల్లీ సరిహద్దుల్ని వీడేదిలేదు : రైతు సంఘాలు
సాగు చట్టాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వానికి అక్టోబరు 2వ వరకు గడువునిస్తున్నట్టు వెల్లడించారు.

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతంగా సాగుతోంది. శనివారం నిర్వహించిన 'చక్కా జామ్‌' దేశమంతటా ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో.... తమ పోరాటం ఆగదని రైతు సంఘాల నేతలు స్పష్టంచేశారు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు దిల్లీ సరిహద్దుల్ని వీడేదిలేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధికార ప్రతినిధి, రైతు నేత రాకేశ్‌ టికాయిత్‌ ప్రకటించారు. సాగు చట్టాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వానికి అక్టోబరు 2వ వరకు గడువునిస్తున్నట్టు వెల్లడించారు. చక్కా జామ్‌ కార్యక్రమం ముగిసిన తర్వాత గాజీపుర్‌ దీక్షా శిబిరం వద్ద కార్యచరణ వెల్లడించారు.

అటు... శనివారం దేశవ్యాప్తంగా చక్కాజామ్‌ ఆందోళన ఉధృతంగా సాగింది. దిల్లీలోని 10 మెట్రో రైలు స్టేషన్లను అధికారులు మూసివేశారు. మధ్యాహ్నం 3 గంటలకు రాస్తారోకో ముగిసిన తర్వాతే స్టేషన్లను తెరిచారు. గణతంత్ర దినోత్సవం నాటి రైతు కవాతులో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు దిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. డ్రోన్లతో పహారా కొనసాగించారు. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో రహదారుల దిగ్బంధనం పూర్తిస్థాయిలో కొనసాగింది. రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలు రహదారులపై నిలిపి వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. ఆందోళనల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ, మధ్యప్రదేశ్‌, బిహార్‌లో నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు జరిగాయి. కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు రహదారుల దిగ్బంధనంలో పాల్గొన్నారు. చక్కా జామ్‌ కార్యక్రమాన్ని 'అన్నదాతల శాంతియుత సత్యాగ్రహం'గా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. తమ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించడంపై దిల్లీ సరిహద్దుల్లోని శిబిరాల్లో రెండు నెలలకు పైగా నిరసనను కొనసాగిస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు. కొత్త సాగు చట్టాలు రద్దు చేసే వరకూ దిల్లీలో పోరు కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు స్పష్టంచేశారు. కనీస మద్దతు ధరకు హామీ ఇస్తూ చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ తర్వాతే రైతులు ఇళ్లకు తిరిగి వెళ్తారని అని రాకేశ్‌ టికాయిత్‌ స్పష్టంచేశారు.


Tags

Read MoreRead Less
Next Story